`అమ్మ`నమ్మ కట్టెల పొయ్యి కష్టాలే `దీపం`కి దారి చూపాయి
మహిళా సంక్షేమానికి ఇప్పటి వరకు ప్రకటించిన నాలుగు పథకాలే కాకుండా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు వారి ద్వారా చేసే ఆలోచన ఉందని చంద్రబాబు వెల్లడించారు.
మా అమ్మ కష్టాలు నేను దగ్గర ఉండి చూశా.. అందుకే ఆనాడు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు తీసుకువచ్చామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మీడియాతో ముచ్చటిస్తూ ఆయన చాలా అంశాలు మాట్లాడారు. నా చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చాలా కష్టాలు పడేది, అనంతరకాలంలో నేను సీఎం అయ్యాక దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందజేశా. ఇప్పుడు భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం పంపిణీ చేసే పథకాన్ని ప్రకటించాం` అన్నారు.
మహిళా సంక్షేమానికి ఇప్పటి వరకు ప్రకటించిన నాలుగు పథకాలే కాకుండా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు వారి ద్వారా చేసే ఆలోచన ఉందని చంద్రబాబు వెల్లడించారు. మహిళల్ని వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా కుటుంబం-సమాజం రెండూ బాగుపడేలా చూస్తామన్నారు.
మహిళా శక్తి అనేది ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందన్నారు. ఈ విధానం పోవాలనే టీడీపీ మినీ మేనిఫెస్టోలో మహా శక్తి పేరిట మహిళలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ పేరుతో ఇటీవల మహానాడులో తాను ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు గురించి మరోసారి వివరించారు చంద్రబాబు.