సైకిల్ పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకెళ్తాం..
ఏపీలో టీడీపీ బలపడుతోందని, అందుకే జగన్ ముందస్తుకి వెళ్తారని జోస్యం చెప్పారు చంద్రబాబు. ఈ ఏడాది నవంబర్ లో, లేదా డిసెంబర్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని, సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వరుసగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించే సరికి చంద్రబాబులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక నుంచి టీడీపీ అన్ స్టాపబుల్ అని అన్నారాయన. గేర్ మార్చి, స్పీడ్ పెంచుతామని చెప్పారు. ‘సైకిల్‌పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం’ అంటూ వైరి వర్గాలను హెచ్చరించారు. సీఎం జగన్ చేసిన విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అప్పులు చేయడం, దోచుకోవడమే జగన్ పని అని మండిపడ్డారు చంద్రబాబు.
ముందస్తుకి జగన్..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, నెల్లూరు నుంచి వచ్చిన మరికొందరు నేతలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ప్రజలకు మంచి చేయాలనే నాయకులకు టీడీపీలో ఎప్పుడూ చోటు ఉంటుందని చెప్పారు. ఏపీలో టీడీపీ బలపడుతోందని, అందుకే జగన్ ముందస్తుకి వెళ్తారని జోస్యం చెప్పారు చంద్రబాబు. ఈ ఏడాది నవంబర్ లో, లేదా డిసెంబర్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని, వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిని నియమిస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అదే 23తో దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. ఇక ప్రారంభం అయ్యింది.
— Telugu Desam Party (@JaiTDP) March 24, 2023
- తెలుగుదేశం అధినేత @ncbn#ByeByeJaganIn2024 pic.twitter.com/lcSUZppOZ9
వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి..
సంతలో పశువుల లాగా జగన్ టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు చంద్రబాబు. ఈ ఏడాది మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలలో గుసగుసలు మొదలయ్యాయని చెప్పారు. అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. జగన్ ది ధన బలమైతే.. టీడీపీది జనబలం అని అన్నారు. పట్టభద్రుల్లో వచ్చిన తిరుగుబాటు ఫలితంగానే టీడీపీకి మూడు ఎమ్మెల్సీ సీట్లు వచ్చాయన్నారు.
గతంలో తాను కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవమేనన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయి, కార్యకర్తలను పట్టించుకోలేదని, ఇకపై తనకి కార్యకర్తలే అన్నీ అని చెప్పారు.