Telugu Global
Andhra Pradesh

బీజేపీతో పొత్తు వద్దనుకుంటున్నారా..?

బీజేపీ పెద్దలతో జగన్ లింకులు కట్ చేయాలంటే కచ్చితంగా కమలంపార్టీతో పొత్తుండాల్సిందే అని పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నది. మరిప్పుడు పలుకులో రివర్సులో వచ్చింది.

బీజేపీతో పొత్తు వద్దనుకుంటున్నారా..?
X

చంద్రబాబు ఆత్మగా ప్రచారంలో ఉన్న ఎల్లోమీడియాలో వచ్చిన కొత్తపలుకులో అలాగే ఉంది. బీజేపీతో పొత్తుపెట్టుకుంటే టీడీపీకి తీరని నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆందోళనపడుతున్నారట. రాయలసీమలో ముస్లిం మైనారిటీలు అంతా దూరమవుతారని సీనియర్ తమ్ముళ్ళు కూడా బీజేపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అందుకనే ఎన్నికలకు ముందు పొత్తు వద్దని చంద్రబాబు అనుకున్నారట. ఎన్నికలకు ముందు పొత్తుపెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి మేలుచేసినట్లే అన్న విషయాన్ని బీజేపీ పెద్దలకు నచ్చచెబుతున్నారట.

అందుకే పొత్తుకోసం తనపై ఒత్తిడి తేవద్దని, ఎన్నికలైపోయిన తర్వాత ఎన్డీయేలో చేరతానని నచ్చచెప్పే ప్రయత్నాలు టీడీపీ, జనసేన తరపున జరుగుతున్నట్లు ఆ పలుకులో ఉంది. అంటే టీడీపీతో పొత్తుకు బీజేపీనే వెంపర్లాడుతోందన్నట్లుగా కలరింగిచ్చారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు. ఎందుకంటే.. బీజేపీతో పొత్తులేకుండా జనసేనతో మాత్రమే కలిసివెళ్ళటం వల్ల చాలా ఇబ్బందులుంటాయని చంద్రబాబు భయపడుతున్నారు. దీంతోనే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు..? ఎందుకంటే కేంద్రప్రభుత్వంలోని పెద్దల అండదండలు జగన్మోహన్ రెడ్డికి అందకుండా ఉండటానికి మాత్రమే.

బీజేపీ పెద్దలతో జగన్ లింకులు కట్ చేయాలంటే కచ్చితంగా కమలంపార్టీతో పొత్తుండాల్సిందే అని పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నది. మరిప్పుడు పలుకులో రివర్సులో వచ్చింది. పైగా ముస్లిం మైనారిటీల ఓట్లు టీడీపీకి దూరమవుతాయనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని చెప్పటమే విచిత్రం. ఎందుకంటే.. ముస్లిం మైనారిటీ ఓట్లు టీడీపీకి దూరమై పదేళ్ళవుతోంది. గడచిన రెండుఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ముస్లింనేత కూడా గెలవలేదు. కాబట్టి ముస్లింల ఓట్లకోసమే బీజేపీతో పొత్తుపెట్టుకోవటానికి చంద్రబాబు భయపడుతున్నారని చెప్పటంలో అర్థంలేదు.

తమతో పొత్తుకు బీజేపీ పెద్దలను కూడా ఒప్పిస్తానని పదేపదే పవన్ ప్రకటిస్తున్నారు. పవన్ ప్రకటనకు భిన్నంగా పలుకులో ఉంది. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వద్దని పవన్ కూడా అనుకుంటున్నట్లు పలుకులో ఉంది. చూస్తుంటే బీజేపీతో పొత్తుపెట్టుకుంటే టీడీపీకి నష్టమన్న ఎల్లోమీడియా ఆలోచనలన్నీ చంద్రబాబు ఆలోచనలుగా చెప్పినట్లుంది. మరి బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఏమిచేయబోతున్నారన్నది చాలా ఆసక్తిగా ఉంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  7 Jan 2024 12:37 PM IST
Next Story