బీహార్ బందిపోటే దిక్కయ్యాడా ?
బీహార్లో బిజీగా ఉన్న పీకేని లోకేష్ ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక విమానంలో విజయవాడకు పట్టుకొచ్చారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకింత ఆశ్చర్యం అంటే.. ఇదే పీకేని ఒకప్పుడు చంద్రబాబు బీహార్ బందిపోటుగా అభివర్ణించారు.
ఏ దిక్కులేకపోతే అక్కమొగుడే దిక్కనే సామెత తెలుగులో చాలా పాపులర్. చంద్రబాబునాయుడు వ్యవహారం చివరకు అలాగే తయారైనట్లుంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదని బాగా అర్థమైపోయినట్లుంది. అందుకనే చివరకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకోబోతున్నట్లున్నారు. 2019లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ (పీకే)ను బతిమలాడుకుని, మొహమాటపెట్టి, ఒత్తిడి పెట్టి మరీ విజయవాడకు పిలిపించుకున్నారు.
బీహార్లో బిజీగా ఉన్న పీకేని లోకేష్ ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక విమానంలో విజయవాడకు పట్టుకొచ్చారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకింత ఆశ్చర్యం అంటే.. ఇదే పీకేని ఒకప్పుడు చంద్రబాబు బీహార్ బందిపోటుగా అభివర్ణించారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బీహార్ బందిపోటు పీకేతో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసినట్లు ఊరూవాడా తిరిగి తిట్టని తిట్టులేదు. రాష్ట్రాన్ని కులాల వారీగా పీకే విభజించి నాశనం చేసినట్లు నానా గోల చేశారు. జగన్‌ను సీఎం చేయటం కోసం పీకే రాజకీయాలను భ్రష్టుపట్టించేశారని నానా మాటలు అన్నారు.
సీన్ కట్ చేస్తే.. చివరకు అదే పీకేని ఇదే చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడకు పిలిపించుకున్నారు. అవసరం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారనటానికి పీకేని పిలిపించుకోవటమే తాజా ఉదాహరణ. ఇప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న వ్యూహకర్త రాబిన్ సింగ్ ఉన్నాకూడా మళ్ళీ పీకేని పిలిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అంటే రాబిన్ వ్యూహాలు పార్టీకి పెద్దగా వర్కవుటవుతున్నట్లు లేదు. అయితే ఎన్నికలకు ఇంకా ఉన్నది నాలుగు నెలలు మాత్రమే.
ఈ పరిస్థితుల్లో పీకేని పిలిపించుకుని మాట్లాడటం వల్ల ఏమిటి ఉపయోగమో చంద్రబాబుకే తెలియాలి. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు లోకేష్ చాలారోజులు ఢిల్లీలో కూర్చున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కూర్చుని పీకేతో చాలాసార్లు భేటీ అయ్యారట. టీడీపీ గెలుపునకు తమతో కలిసి పనిచేయాలని లోకేష్ ఎంతడిగినా పీకే కుదరదు పొమ్మన్నారట. అయితే తర్వాత ఏమైందో ఏమో మొత్తానికి పీకేని విజయవాడకు లోకేష్ పట్టుకొచ్చారు. అయినా పార్టీలో, పార్టీ అధినేతలో దమ్ములేకపోతే వ్యూహకర్తలు ఏమీ చేయలేరన్న విషయం చంద్రబాబు, లోకేష్ మరచిపోయినట్లున్నారు.