Telugu Global
Andhra Pradesh

అమిత్ షాను సూటిగా ప్రశ్నిస్తున్న చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై అమిత్ షా, నడ్డా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జగన్‌ అవినీతి అంటూ ప్రకటనలు సరే, మరి చర్యలెప్పుడు తీసుకుంటారో చెప్పాలని అమిత్ షాను ప్రశ్నించారు.

అమిత్ షాను సూటిగా ప్రశ్నిస్తున్న చంద్రబాబు
X

నాలుగేళ్లుగా బీజేపీ పెద్దల పేర్లు ప్రస్తావించాలంటేనే వెనుకడుగు వేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు హఠాత్తుగా అమిత్ షాను సూటిగా ప్రశ్నిస్తున్నా అన‌డం చర్చనీయాంశమవుతోంది. కుప్పం పర్యటనలో ఉన్నచంద్రబాబు.. ఇటీవల ఏపీకి వచ్చిన సమయంలో జగన్ ప్రభుత్వంపై అమిత్ షా, నడ్డా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. జగన్‌ అవినీతి అంటూ ప్రకటనలు సరే, మరి చర్యలెప్పుడు తీసుకుంటారో చెప్పాలని అమిత్ షాను ప్రశ్నించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయగా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించాయి.

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు బీజేపీని నిలదీసేలాగే ఉన్నాయి. 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కోర్టు వాయిదాకు హాజరు కాలేదు.. బీజేపీ సహకారం లేకుండానే ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేయడం లేదంటే బీజేపీ మద్దతు లేకుండానే అది సాధ్యమవుతుందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చూస్తే.. జగన్‌ను బీజేపీ పెద్దలే వెనుకేసుకొస్తున్నారన్న సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. నిందితులను కాపాడే పార్టీ బీజేపీ అన్న ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.

ఇలా ఎందుకు హఠాత్తుగా బీజేపీ హైకమాండ్‌ను ఇరుకునపెట్టే పనిని టీడీపీ పెద్దలు మొదలుపెట్టారన్న దానిపైనే చర్చ నడుస్తోంది.

First Published:  15 Jun 2023 4:29 PM IST
Next Story