Telugu Global
Andhra Pradesh

బాబూ మాపై ఎందుకీ భారం.. తెలుగు తమ్ముళ్ల ఆవేదన

బాబు ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లు తల పట్టుకుంటున్నారు. అసలే అధికారంలో లేని పార్టీ.. పైగా గత మూడేళ్లుగా సొంత ఖర్చుతో బాబు ఆదేశించిన పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు అన్న క్యాంటీన్ నిర్వహించమంటే ఎక్కడి నుంచి నిధులు తేవాలని ప్రశ్నిస్తున్నారు.

బాబూ మాపై ఎందుకీ భారం.. తెలుగు తమ్ముళ్ల ఆవేదన
X

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. ఈ సారి ఎన్నికలు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్యగా మారినట్లు ఆయన సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. తన వర్గపు మీడియా పార్టీకి ఎంత సహకరిస్తున్నా.. ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేకపోతున్నామని చంద్రబాబు గ్రహించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను జనాలు మర్చిపోవడం లేదని.. వైసీపీ అమలు చేస్తున్న పథకాలకు చాలా అకర్షించబడ్డారని బాబు అంచనాకు వచ్చారు. దీంతో సరికొత్త వ్యూహానికి తెరతీశారు.

రాష్ట్రంలోని ప్రతీ మండల కేంద్రం, నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను ఆదేశించినట్లు సమాచారం. చంద్రబాబు పాలన ముగిసే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేవలం రూ. 10కే భోజనం.. అంత కంటే తక్కువ ధరకు అల్పాహారం అందించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను కంటిన్యూ చేయలేదు. కానీ, మంగళగిరి, కుప్పం, హిందూపురంలో తెలుగుదేశం నాయకులే అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల కుప్పం అన్న క్యాంటీన్ విషయంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ఇరు వర్గాల గొడవ కాస్తా.. అన్న క్యాంటీన్ విధ్వంసం వరకు వచ్చింది. అయినా సరే ప్రతీ మండలంలో అన్న క్యాంటీన్ నిర్వహించమని తెలుగు తమ్ముళ్లకు బాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

బాబు ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లు తల పట్టుకుంటున్నారు. అసలే అధికారంలో లేని పార్టీ.. పైగా గత మూడేళ్లుగా సొంత ఖర్చుతో బాబు ఆదేశించిన పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు అన్న క్యాంటీన్ నిర్వహించమంటే ఎక్కడి నుంచి నిధులు తేవాలని ప్రశ్నిస్తున్నారు. క్యాంటీన్ నిర్వహించడం అంత తేలికైన విషయం కాదని వాపోతున్నారు. బాబు మాత్రం.. దాతలు, కార్పొరేట్ కంపెనీలను పట్టుకొని క్యాంటీన్లు నిర్వహించమని ఖరాఖండీగా చెప్పారట. అన్న క్యాంటీన్లు నిర్వహించడం ద్వారా వైసీపీని ఇరుకున పెట్టవచ్చని.. ఒక వేళ క్యాంటీన్లకు అనుమతి ఇవ్వక పోతే ఆ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయవచ్చని పార్టీ నాయకులతో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యూహం బాగానే ఉన్నా.. అంత ఖర్చు పెట్టి క్యాంటీన్లు ఎలా నిర్వహించాలని? ఒక వేళ క్యాంటీన్లు తాము నిర్వహించినా.. తమకే టికెట్ వస్తుందనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్, హిందూపురంలో బాలకృష్ణ నిర్వహిస్తున్నారంటే.. వాళ్లకు తగినన్ని నిధులు ఉండబట్టే. కానీ, ప్రతీ రోజు 1000 మందికి అన్నం పెట్టే సామర్థ్యం తమకు లేదని తెగేసి చెప్పారట. అవసరం అయితే ఎన్టీఆర్ ట్రస్టు నుంచి నిధులు ఇప్పిస్తే.. అప్పుడు కొంత డబ్బు వేసుకొని నిర్వహిస్తామని లేకపోతే ఆ భారం మోయలేమని స్పష్టం చేశారు. మాపై అనవసరంగా ఈ భారం పెట్టవద్దని.. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉన్నామని కొంత మంది నాయకులు నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు దీనికి వేరే పరిష్కారం వెతుకుతారా లేదంటే చెప్పినట్లు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తారా అనేది వేచి చూడాలి.

First Published:  13 Sept 2022 12:52 PM GMT
Next Story