కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించి చులకన కాదల్చుకోలేదు
జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలను మీడియా చంద్రబాబు వద్ద ప్రస్తావించింది. ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించి తాను చులకన కాదల్చుకోలేదని స్పష్టం చేశారు బాబు.
బీజేపీతో తెలుగుదేశం పొత్తుంటుందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై చంద్రబాబు తన శైలికి భిన్నంగా స్పందించారు. ఎవరెవరో వ్యాఖ్యలపై స్పందించి తాను చులకన కాదలచుకోలేదని కుండబద్దలు కొట్టారు. తాజాగా కేంద్ర మంత్రి నారాయణ స్వామి అనంతపురం జిల్లాకు వచ్చారు. ఏపీలో పొత్తులు ఉంటాయని.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు. కేంద్రమంత్రి ప్రకటన రాజకీయవర్గాల్లో గత కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చేలా ఉన్నాయి.
జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలను మీడియా చంద్రబాబు వద్ద ప్రస్తావించింది. ఎవరెవరో మాట్లాడే వాటికి ఇప్పుడు స్పందించి తాను చులకన కాదల్చుకోలేదని స్పష్టం చేశారు బాబు. దగా పడ్డ ఏపీ ప్రయోజనాలే ఇప్పుడు తనకు ముఖ్యమన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన చైతన్యం తీసుకురావడం తన ముందున్న ప్రధానమైన అంశమన్నారు. తనపై ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు పెద్ద ఆలోచనలు అవసరం అని చెప్పుకొచ్చారు. ప్రజలు గట్టిగా ఒక మాట మీద ఉంటే కేంద్రం దిగివస్తుందనేందుకు జల్లికట్టు ఘటనే ఓ ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి పొత్తు ఉంటుందని వ్యాఖ్యలు చేస్తుంటే, స్పందించి చులకన కాదల్చుకోలేదని చంద్రబాబు స్పందన వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పెద్ద ఆలోచనలు అని బాబు చెప్పడం వెనుక ఏదో ఆంతర్యం ఉండే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల్ని కలిసి చర్చించారు. అనంతరం టీడీపీని ఎన్డీఏలోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే తమకు ఆహ్వానమే లేదని టీడీపీ స్పష్టం చేసింది. మళ్లీ కేంద్రమంత్రి ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు పొత్తుల ఎత్తులను తెలియజేస్తున్నాయి.