ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకంటే..?
కేంద్ర బడ్జెట్ రూపకల్పన నేపథ్యంలో ఏపీ తరపున కేటాయింపుల కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ కి బయలుదేరుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈనెల 4న ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ఆయన ఢిల్లీకి వెళ్లబోతుండటంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఏపీ తరపున ఆయన కేంద్రాన్ని ఏమేం అడుగుతారనేదానిపై చర్చ మొదలైంది. ఇటీవల బీహార్ కోసం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా తీర్మానం చేయగా, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో హోదా ప్రస్తావన వస్తుందా అనేది తేలాల్సి ఉంది.
కేంద్ర బడ్జెట్ రూపకల్పన నేపథ్యంలో ఏపీ తరపున కేటాయింపుల కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ కి బయలుదేరుతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో అపాయింట్ మెంట్ అధికారికంగా ఖరారు కాలేదు కానీ, ఆయనతో కూడా చంద్రబాబు భేటీ అవుతారని పార్టీ వర్గాలంటున్నాయి.
పోలవరంపై తేల్చేస్తారా..?
ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మరో నాలుగేళ్లయినా పూర్తి చేయలేమని, ఆ స్థాయిలో గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పారు. ఆ తర్వాత శ్వేత పత్రం విడుదల చేశారు. తాజాగా అంతర్జాతీయ నిపుణులను పిలిపించి పోలవరంపై మదింపు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు నివేదించే అవకాశముందని, పోలవరంపై తదుపరి కార్యాచరణకు కూడా అక్కడే చర్చలు జరుగుతాయని అంటున్నారు. కేంద్ర జలశక్తి అధికారులతో కూడా చంద్రబాబు భేటీ అవుతారని అంటున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలి ఢిల్లీ పర్యటన కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. మరి ఢిల్లీ నుంచి చంద్రబాబు వట్టిచేతులతో వస్తారా, లేక రాష్ట్రానికి దండిగా నిధులు రాబడతారా..? వేచి చూడాలి.