Telugu Global
Andhra Pradesh

నెల్లూరు అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు

వైసీపీ నుంచి అనిల్ కి టికెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, టీడీపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించేసింది.

నెల్లూరు అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
X

నారా లోకేష్ యువగళం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి సవాళ్లు, ప్రతి సవాళ్లు బయటకొచ్చాయి. దమ్ముంటే నెల్లూరు సిటీలో తనపై పోటీ చేసి గెలవాలంటూ ఆనం రామనారాయణ రెడ్డికి ఓసారి, నారా లోకేష్ కి మరోసారి సవాల్ విసిరారు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ముందు నీ టికెట్ సంగతి తేల్చుకో అంటూ టీడీపీ నుంచి ప్రతి సవాళ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీకి సంబంధించి టీడీపీ అభ్యర్థిని ఖరారు చేశారు చంద్రబాబు. నెల్లూరు సిటీకి మాజీ మంత్రి పి.నారాయణను టీడీపీ ఇన్ చార్జ్ గా ప్రకటించారు.

2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి తర్వాత మాజీ మంత్రి నారాయణ నెల్లూరుకి మొహం చాటేశారు, విద్యావ్యవస్థలు, ఇతర వ్యాపారాల్లో మునిగిపోయారు. అప్పుడప్పుడు సీఆర్డీఏ వ్యవహారంలో నారాయణ పేరు వినిపించడం మినహా మిగతా సందర్భాల్లో అసలు ఆయన ప్రస్తావనే లేదు. దీంతో ఆయన ప్రత్యామ్నాయంగా నెల్లూరు సిటీ టీడీపీకి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఇన్ చార్జ్ గా పెట్టారు. అయితే అభ్యర్థి మాత్రం నారాయణే అనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఎన్నికల సీజన్లో నారాయణ మళ్లీ తెరపైకి వచ్చారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లతో ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు.

వైసీపీ నుంచి అనిల్ కి టికెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, టీడీపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించేసింది. సిటీ టీడీపీ ఇన్ చార్జ్ గా నారాయణ పేరు ఖరారు చేయడంతో 2024 ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అనే విషయం తేలిపోయింది. ఇప్పటి వరకూ ఆ పోస్ట్ లో ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేశారు. గతంలో నారాయణపై స్వల్ప తేడాతో గెలుపొందిన అనిల్, ఈసారి కూడా టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అనిల్ కి ప్రస్తుతం ఇంటిపోరు ఎక్కువైంది సొంత పార్టీనుంచే ఆయనకు కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు. ఇప్పుడు నారాయణ బలమైన ప్రత్యర్థి కావడంతో అనిల్ కి టికెట్ వచ్చినా ఈసారి వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని సమాచారం.

First Published:  30 Jun 2023 2:35 AM GMT
Next Story