Telugu Global
Andhra Pradesh

‘మోడీని చంద్రబాబు చేరుకోలేకపోయాడు, జగన్‌ చేరుకోగలిగాడు’

సాధారణంగా చంద్రబాబు తనకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే దేని గురించైనా హడావిడి చేస్తాడు. ఆయన కోసం బాజాభజంత్రీలు మోగించే ఎల్లో మీడియా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేస్తుంది.

‘మోడీని చంద్రబాబు చేరుకోలేకపోయాడు, జగన్‌ చేరుకోగలిగాడు’
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా కలవడానికి ఇష్టపడలేదా? కాంగ్రెస్‌ నాయకుడు కేవీపీ రామచందర్‌ రావు మాటలను బట్టి చూస్తే అదే నిజమనిపిస్తోంది. చంద్రబాబును మోడీ పర్సనల్‌గా కలవాలని అనుకోలేదని తనకు అనిపిస్తున్నట్లు ఆయన చెప్పారు. చంద్రబాబు హస్తినకు వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోలేదు. అవకాశం వస్తే చంద్రబాబు కలవకుండా ఉంటారా, ఉండరు. మోడీ ఇష్టపడలేదు కాబట్టే చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని అనుకోవాల్సి వస్తుంది.

మోడీ కలవకపోయినా సంతృప్తి చెంది చంద్రబాబు ఎందుకు వచ్చారని కూడా కేవీపీ ప్రశ్నించారు. చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు గుర్తుకు రావని ఆయన దుయ్యబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం, అధికారం కోసం హస్తినకు వెళ్లారా అనేది ప్రజలకు చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మోడీ సన్నిధికి చేరుకోలేకపోయాడు గానీ జగన్‌ చేరుకోగలిగాడని ఆయన అన్నారు.

సాధారణంగా చంద్రబాబు తనకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తే దేని గురించైనా హడావిడి చేస్తాడు. ఆయన కోసం బాజాభజంత్రీలు మోగించే ఎల్లో మీడియా గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేస్తుంది. కానీ ఈసారి చంద్రబాబు హస్తిన పర్యటనపై ఏ విధమైన చడీచప్పుడు లేదు. అమిత్‌ షా, నడ్డాలను కలిసి ఏం సాధించారో, పొత్తు కుదిరిందో లేదో కూడా చెప్పడం లేదు. చంద్రబాబు హస్తినకు వెళ్లే ముందు ఎల్లో మీడియా పెద్ద కవరేజీయే ఇచ్చింది. టీడీపీతో పొత్తు కోసం బిజెపి తహతహలాడుతున్నట్లు, అందుకే చంద్రబాబును తమ వద్దకు బిజెపి నేతలు పిలిపించుకున్నట్లు కవరింగ్‌ ఇచ్చింది.

చంద్రబాబు హస్తిన నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారనేది కూడా తెలియనంతగా ఎల్లో మీడియా, టీడీపీ వర్గాలు వ్యవహరించాయి. చంద్రబాబు మీడియాకు కూడా ముఖం చాటేశారు. అంటే, చంద్రబాబు ఎంతటి చేదు అనుభవమో ఎదురైతే తప్ప అది జరగదు. అదేమిటో త్వరలోనే తెలిసిపోతుంది. ఏదీ దాగదు.

First Published:  9 Feb 2024 5:10 PM IST
Next Story