ఎలక్షన్ టీమ్‌తో చంద్రబాబు భేటీలు
ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని....పార్టీ నేతలు, ఇంచార్జ్‌లు మరింత దూకుడుగా పని చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి 20 నెలలకి పైగానే సమయం ఉంది. కానీ రాష్ట్రంలో అధికార, విపక్షం హడావిడి చూస్తే ఎన్నికలు ఏ క్షణం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అనేలా కనిపిస్తోంది. ఇటీవల వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో తన ఎమ్మెల్యేలు, 175 నియోజకవర్గాల బాధ్యులతో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రణాళిక, ఐప్యాక్ టీమ్‌తో సమన్వయం వంటివాటిపై స్పష్టత ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సన్నాహాల్లో వైసీపీకి ఏం తీసిపోని విధంగా తాము ముందున్నామంటూ సంకేతాలు ఇస్తోంది. మహానాడు తరువాత మినీ మహానాడు పేరుతో అన్నిప్రాంతాల్లో సభలు నిర్వహించింది టిడిపి. ఈ సందర్భంగా చాలాచోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ముందుగా అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతల పాడు నియోజకవర్గాలపై ఇంచార్జ్‌లతో సమీక్ష చేశారు.
ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని....పార్టీ నేతలు, ఇంచార్జ్‌లు మరింత దూకుడుగా పని చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు.ఈ నాలుగు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఒక్కొక్కరితోనూ గంటకి పైగా భేటీ అయ్యారు. ఎన్నికలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. గురువారం గుంటూరు ఈస్ట్, పుంగనూరు, రాజంపేట, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఒంగోలు, మైదుకూరు ఇన్‍చార్జులతో సమీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన నియోజకవర్గాల టిడిపి ఇన్‌చార్జులతో ముందుగా భేటీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.