పవన్ కల్యాణ్‌కు ఇచ్చేది అంతే.. చంద్రబాబు మెలిక
జనసేన, టీడీపీ కూటమితో బీజేపీ కలిసి వచ్చే అంశంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. బీజేపీతో పొత్తు విషయంపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీట్ల సర్దుబాటులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చుక్కలు చూపించేందుకు సిద్ధపడినట్లు అర్థమవుతుంది. సీట్ల పంపకంలో జనసేనకు ఇచ్చే సీట్లపై చంద్రబాబు గీత గీసినట్లే కనిపిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇవాళ్ల (4వ తేదీన) సమావేశం జరిగింది. అయినా, చర్చలు కొలిక్కి రాలేదు.
జనసేనకు కేవలం 28 సీట్లు మాత్రమే ఇస్తానని చంద్రబాబు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. తమకు కనీసం 45 సీట్లయినా కేటాయించాలని పవన్ కల్యాణ్ పట్టుబట్టినట్లు సమాచారం. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని పవన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరూ మెట్టు దిగకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదు. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ తన పార్టీకి ఎక్కువ సీట్లు అడుగుతున్నారు.
జనసేన, టీడీపీ కూటమితో బీజేపీ కలిసి వచ్చే అంశంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. బీజేపీతో పొత్తు విషయంపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో జనసేన అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీ తర్వాత జనసేన అభ్యర్థుల జాబితాను పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది.