Telugu Global
Andhra Pradesh

బీహార్ కంటే వెనకపడ్డాం.. జగన్ పై బాబు ధ్వజం

టీడీపీ హయాంలో విశాఖలో అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి చేశామని చెప్పారు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు ఏపీ స్థానం దిగజారిపోయిందని, బీహార్ కంటే వెనకపడిందని విమర్శించారు.

బీహార్ కంటే వెనకపడ్డాం.. జగన్ పై బాబు ధ్వజం
X

అంకుర సంస్థలకు ఏపీలో ఏమాత్రం సహకారం లేదని మండిపడ్డారు . సీఎం జగన్ నిర్లక్ష్యం, నిరాసక్తత వల్లే స్టార్టప్ ల విషయంలో ఏపీ పరిస్థితి మరీ దిగజారిందని అన్నారాయన. స్టార్టప్ ల విషయంలో ఏపీ, బీహార్ కంటే వెనకపడిందని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను జగన్‌ ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. పోటీ ప్రపంచంలో రాష్ట్ర యువత భవిష్యత్‌ గురించి తలచుకుంటే బాధగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబు.

2019 వరకు, దేశంలోనే అత్యధికంగా అంకుర సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానంగా ఉండేదని, స్టార్టప్‌ లు అభివృద్ధి చెందడానికి విశాఖలో అనుకూల వాతావరణాన్ని తామే తీసుకొచ్చామని చెప్పారు. టీడీపీ హయాంలో విశాఖలో అంకుర సంస్థల ఏర్పాటుకు ఎంతో కృషి చేశామని చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఏపీ స్థానం దిగజారిపోయిందని, బీహార్ కంటే వెనకపడిందని విమర్శించారు.

యువగళంలో లోకేష్ విమర్శలు..

గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్‌ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని యువగళం పాదయాత్రలో విమర్శించారు నారా లోకేష్. ఎస్సీలపై దాడులు పెరిగిపోవడానికి ముఖ్యమంత్రే కారణమని అన్నారు. దాడులకు పాల్పడేందుకు వైసీపీ సైకోలకు ఆయన లైసెన్స్ ఇచ్చారంటూ మండిపడ్డారు. దళితులపై దాడులు చేసి తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఉదంతాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. తన పాదయాత్రను అడ్డుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

వంద కిలోమీటర్లకే ఇద్దరు..

యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్లు తిరిగే లోపే, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని, పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఇంకెంతమంది బయటకొస్తారోనని అంటున్నారు టీడీపీ నాయకులు. ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో మిగలరని సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు.

First Published:  4 Feb 2023 8:06 PM IST
Next Story