అప్పుల గురించి విమర్శించే నైతికత చంద్రబాబుకి ఉందా..?
అయినవాళ్లకు దోచి పెట్టడం చంద్రబాబు ఆనవాయితీ, అందరికీ సమంగా సంక్షేమ పథకాలు అందించడం జగన్ అలవాటు. పేదలు బాగుపడటం ఇష్టంలేదు కనుకే చంద్రబాబు మళ్లీ తనకు అధికారం కావాలంటున్నారు.
అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదంటూ తాజాగా చంద్రబాబు సెలవిచ్చారు. సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు అప్పుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నవ్యాంధ్రను అప్పుల ఊబిలోకి నెట్టేసిన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయారని, ఇప్పుడు జగన్ పై నెపం నెట్టేందుకు అసత్య ప్రచారాలకు తెరతీశారని అంటున్నారు.
రాష్ట్ర విభజన సమయానికి ఉమ్మడి ఏపీ అప్పు లక్షా 66వేల కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్ర ఖాతాలో 69,479.48 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఖాతాలో రూ.97,123.93 కోట్లుగా అప్పులను విభజించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేశారు. 2019 ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 2,64,451 కోట్లకు అప్పును పెంచారు. అంటే 1,67,327.07 కోట్ల రూపాయలు చంద్రబాబు అప్పుచేశారన్నమాట. రాష్ట్ర విభజన సమయానికి ఉన్న అప్పు కంటే ఇది దాదాపు రెండు రెట్లు. మరి రాష్ట్రంపై రుణభారం పెంచి చంద్రబాబు చేసిందేంటి అంటే.. చెప్పుకోడానికి ఒక్క పని కూడా లేదు. పోలవరం పూర్తి చేయలేదు, కొత్త పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు అభివృద్ధి చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లకు కనీసం సున్నం కూడా వేయించలేదు.
జగన్ హయాంలో అప్పులు చేశారంటున్నారు సరే, మరి అభివృద్ధి సంగతేంటి..? నాడు-నేడు కోసం ఖర్చు చేసిన నిధులెన్ని..? గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల పేరిట శాశ్వత ఆస్తులుగా సమకూరిన వనరులెన్ని..? పెరిగిన ఉద్యోగాలెన్ని, ఇస్తున్న జీతాలెంత..? కొత్తగా వస్తున్న ఓడరేవులెన్ని..? సంక్షేమ పథకాలకు పెడుతున్న ఖర్చెంత..? ఇన్ని చేస్తున్న జగన్ ని అప్పులు చేస్తున్నావంటూ అనడానికి చంద్రబాబుకి నోరెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి జగన్ చేతిలో పెట్టారు చంద్రబాబు. ఆర్థిక కష్టాలను సరిచేస్తూ సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేస్తూ ఓ పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నారు జగన్. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప..? ఎవరు విజనరీ..? అయినవాళ్లకు దోచి పెట్టడం చంద్రబాబు ఆనవాయితీ, అందరికీ సమంగా సంక్షేమ పథకాలు అందించడం జగన్ అలవాటు. పేదలు బాగుపడటం ఇష్టంలేదు కనుకే చంద్రబాబు మళ్లీ తనకు అధికారం కావాలంటున్నారు. సంపద సృష్టిస్తానంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సృష్టించలేని సంపద.. ఇప్పుడు కొత్తగా సృష్టిస్తానంటే నమ్మడానికి ప్రజలు రెడీగా లేరు. కూటమి కుయుక్తులను ఓ కంట కనిపెడుతున్నారు. కీలెరిగి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.