గడప హిట్, బాదుడు ఫ్లాప్.. టీడీపీ నేతలకు బాబు క్లాస్..
మీరు మారకపోతే.. నేను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉంటుందనే హెచ్చరికలు జారీ చేశారు.
రెండేళ్ల ముందుగానే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో అధికార, విపక్షాలు తమదైన శైలిలో కార్యక్రమాలను రూపొందించాయి. ప్రభుత్వ విజయాలను జనంలోకి తీసుకెళ్లేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ప్రభుత్వ వైఫల్యాలు ఇవీ అంటూ బాదుడే బాదుడు కార్యక్రమంతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. ఎన్నికల వరకు ఈ రెండు కార్యక్రమాలను కొనసాగించి, ఎన్నికల వేళ అధినాయకులు యాత్రలకు శ్రీకారం చుడతారనే అంచనాలున్నాయి. అయితే బాదుడే బాదుడు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా నేతలతో జూమ్ రివ్యూ నిర్వహించిన ఆయన నాయకులు జనంలోకి వెళ్లడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నేతల మీద గట్టి ఫోకస్ ఉంటుందని.. ఎన్నికల ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాల్సిన నేతలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు చంద్రబాబు. మీరు మారకపోతే.. నేను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉంటుందనే హెచ్చరికలు జారీ చేశారు.
అటు గడప గడపపై కూడా సీఎం జగన్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రెండు సార్లు సమీక్షలు నిర్వహించారు. నిదానంగా ఉన్న ఎమ్మెల్యేలకు చురకలంటించారు. కానీ టీడీపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు ఉత్సాహంగా జనంలోకి వెళ్తున్నారు. టీడీపీలో నియోజకవర్గ ఇన్ చార్జ్ ల విషయంలో గందరగోళం ఉంది. జనంలో తిరిగేది ఎవరు, టికెట్ వచ్చేది ఎవరికి అనే అనుమానాలున్నాయి. పొత్తుల గందరగోళం ఎలాగూ ఉంది. అందుకే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. దీంతో చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు మొదలు పెట్టారు, ముందుగా అనంతపురం జిల్లా నేతలకు క్లాస్ తీసుకున్నారు.
టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు కనిపించడం ఆ తరువాత ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతోందని అన్నారు చంద్రబాబు. నాయకులు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎప్పుడు జనంలోకి వెళ్లారు.. ఎంత సేపు అక్కడుంటున్నారు.. అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారనే విషయాలపై తనకు పూర్తి స్థాయి క్లారిటీ ఉందని, దానికి అనుగుణంగానే తదుపరి చర్యలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ సభ్యత్వ నమోదు గతంలో కంటే దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై కూడా ఎవరూ నిరసన కార్యక్రమాలు చేపట్టడంలేదని అన్నారు. మొత్తమ్మీద వైసీపీ గడప గడప హిట్ అయందని, ఆ స్థాయిలో టీడీపీ బాదుడే బాదుడు జరగడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట చంద్రబాబు.