ఏ ప్రయోజనాలకీ పొత్తు.. చెప్పగలవా చంద్రబాబూ?
విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ హామీ ఇచ్చిందా? లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటామని బీజేపీ చంద్రబాబుకు హామీ ఇచ్చిందా? అదీ లేదు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊదరగొడుతున్నారు. పొత్తు కోసం జరిగిన ప్రయత్నాల్లో బీజేపీ పెద్దల కరుణాకటాక్ష వీక్షణాల కోసం హస్తినలో పడిగాపులు కాశారు. హస్తినలో చక్రం తిప్పింది తానే అని డాంబికాలు పలికే చంద్రబాబుకు బీజేపీ పెద్దల వద్ద అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కున్నారు. చివరకు టీడీపీ, జనసేన కూటమితో కలిసి రావడానికి బీజేపీ అంగీకరించింది. అయితే, ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన బీజేపీతో పొత్తుకు సిద్ధపడ్డారనేది సమాధానం లేని ప్రశ్న. వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే ఆయన పొత్తుకు సిద్ధపడ్డారనేది స్పష్టం. అందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను పావుగా చేశారు.
అయితే, బీజేపీ నుంచి ఆయన ఏ విధమైన హామీలు పొందారనేది ప్రజలకు తెలియాల్సిందే. హామీలు పొందేంత సత్తా చంద్రబాబుకు లేదని తేలిపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందా? లేదు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని ప్రధాని మోడీ ప్రభుత్వం పలుమార్లు తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే గతంలో చంద్రబాబు సరే అన్నారు. అంతేకాదు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మెరుగు అని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాపై నరేంద్రమోడీ రాష్ట్రాన్ని మోసగించారని విమర్శించారు. మోడీ ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం చేయని ప్రయత్నమంటూ లేదు.
విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ హామీ ఇచ్చిందా? లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటామని బీజేపీ చంద్రబాబుకు హామీ ఇచ్చిందా? అదీ లేదు. రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు బీజేపీతో పొత్తుకు అర్రులు సాచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఊగిపోతూ వ్యాఖ్యలు చేసే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాటిపై ఏమైనా హామీలు పొందారా? రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని బీజేపీ చెప్పిందా? లేదు. ఏ విధమైన హామీలు పొందకుండా చంద్రబాబు బీజేపీకి తనంతట తాను లొంగిపోయారు. ప్రతిదానికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ బీజేపీతో పొత్తు వల్ల ఈ విధమైన ప్రయోజనం కలుగుతుందని ప్రజలకు నిర్దిష్టంగా చెప్పగలరా? లేదు. వారికి కావాల్సింది జగన్ గద్దె దిగి, చంద్రబాబు ఎక్కాలి.
కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై కక్షతో, ఎలాగైనా అధికారంలోకి రావాలనే దాహంతో చంద్రబాబు బీజేపీతో పొత్తుకు కాళ్లావేళ్లాపడ్డారు. అంతేకాదు, దానికి కన్నా ముఖ్యమైన విషయం మరోటి ఉంది. తనను కేసులు చుట్టుముట్టడంతో వాటి నుంచి తనను తాను కాపాడుకోవాలనే దుగ్ధతో ఆయన పొత్తుకు తహతహలాడారు. చంద్రబాబు చాలా నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ నిస్సహాయత నుంచి చేయూత కోసం బీజేపీ పంచన చేరారు.