Telugu Global
Andhra Pradesh

కూటమి కేబినెట్ లో వైసీపీ కోటా.. ఇద్దరికి మంత్రి పదవులు

చివరి నిమిషంలో వైసీపీనుంచి టీడీపీలోకి చేరి గెలిచినవారంతా అదృష్టవంతులు అనుకుంటే.. ఏకంగా మంత్రి పదవుల్ని దక్కించుకున్న ఆ ఇద్దరు మరింత అదృష్టవంతులని చెప్పాలి.

కూటమి కేబినెట్ లో వైసీపీ కోటా.. ఇద్దరికి మంత్రి పదవులు
X

ఏపీ కేబినెట్ కొలువుదీరబోతోంది. కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ.. ఇలా సామాజిక సమీకరణాల లెక్కలు కుదిరాయి. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీకి కూడా ప్రాధాన్యతా పరంగా సీట్లు సర్దుబాటు అయ్యాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఆ 24మందిలో వైసీపీ కోటా కూడా ఉండటం విశేషం. 2019లో వైసీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఈ దఫా టీడీపీ టికెట్ పై గెలిచి ఏకంగా మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.

ఏపీ ఎన్నికల వేళ అటునుంచి ఇటు, ఇటునుంచి అటు జంపింగ్ లు బాగానే జరిగాయి. జంప్ చేసిన నేతలకు టికెట్లు రావడమే కష్టం అనుకున్న తరుణంలో వారిద్దరికీ టికెట్లు ఖరారయ్యాయి. అయితే నియోజకవర్గాలు మాత్రం తారుమారయ్యాయి. 2019లో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు కాకుండా 2024లో టీడీపీ తరపున కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేశారు, అయినా గెలిచారు. అక్కడితో వారి అదృష్టరేఖ ఆగిపోలేదు. ఏకంగా వారిద్దరూ ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా కొలువుదీరబోతున్నారు.

2019లో వైసీపీ టికెట్ పై నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. జగన్ కి క్రమంగా దూరం జరిగారు. చివర్లో టీడీపీలో చేరి టికెట్ సాధించారు. నియోజకవర్గం విషయంలో తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఆత్మకూరుకి షిఫ్ట్ అయ్యారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనం సీనియార్టీకి చంద్రబాబు అవకాశమిచ్చారు.

2019లో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొలుసు పార్థసారథి కూడా అప్పట్లో జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. తర్వాత టికెట్ కూడా ఇవ్వలేనని జగన్ చెప్పడంతో తనదారి తాను చూసుకున్నారు. నూజివీడుకి మకాం మార్చారు. టీడీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అవుతున్నారు పార్థసారథి.

చివరి నిమిషంలో వైసీపీనుంచి టీడీపీలోకి చేరి గెలిచినవారంతా అదృష్టవంతులు అనుకుంటే.. ఏకంగా మంత్రి పదవుల్ని దక్కించుకున్న కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి మరింత అదృష్టవంతులని చెప్పాలి.

First Published:  12 Jun 2024 8:34 AM IST
Next Story