ట్రెండింగ్‌లో "చివరి ఎన్నికలు".. వైసీపీ మంత్రుల మూకుమ్మడి దాడి
తులసి నీళ్లు పోస్తే బతుకుతానని చంద్రబాబు తనకి తానే చెప్పుకుంటున్నారని సెటైర్లు పేల్చారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు పోటీ చేయకపోతే ఎవరికీ నష్టం లేదని, ఆయన ఎవర్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
"నాకివే చివరి ఎన్నికలు". ఏపీలో ప్రస్తుతం ఇదే ట్రెండింగ్ టాపిక్. చంద్రబాబు తనకివే జీవితంలో చివరి ఎన్నికలంటూ కర్నూలు జిల్లాలో చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. వయోభారంతో ఆయన ఆ మాటచెప్పారో, లేక ఈ ఎన్నికల్లో అయినా టీడీపీని గట్టెక్కించండని వేడుకున్నారో.. తెలియదు కానీ వైసీపీ మాత్రం గట్టిగానే రియాక్ట్ అవుతోంది. వైసీపీ మంత్రులు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. సింపతీ కోసం ట్రై చేయకు బాబూ అంటూ అంబటి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తే మంత్రులు అప్పలరాజు, అమర్నాథ్.. చంద్రబాబుకి నిజంగానే ఇవి చివరి ఎన్నికలంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం అవుతుందన్నారు.
గతంలో వైసీపీ మంత్రుల్లో ఒకరిద్దరు ఏం పీకుతారంటూ మాట్లాడేవారు, ఇప్పుడు దాదాపుగా అందరూ దానిపై పేటెంట్ తీసుకున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు కూడా చంద్రబాబు ఏం పీకగలరంటూ మండిపడ్డారు. టీడీపీ రాజకీయ భవిష్యత్తుకి చంద్రబాబే సమాధి కడుతున్నారని విమర్శించారు. బాబు చేతకానితనానికి చివరి ఎన్నికలనే వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పారు. ఆయనలో తీవ్రమైన ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. రాజకీయం కోసం చంద్రబాబు ఎంతటి నీఛానికైనా దిగజారుతాడన్నారు అప్పలరాజు. చంద్రబాబు భార్య, తనని రాజకీయాల్లోకి లాగొద్దంటూ తన భర్తకు చెప్పొచ్చు కదా అని సలహా ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకొని ఎంత కాలం చంద్రబాబు రాజకీయాలు చేస్తాడని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర శనక్కాయలు దొంగతనం చేయటం దగ్గర నుంచి మొదలవుతుందన్నారు అప్పలరాజు.
40 ఏళ్లరాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని, అందుకే తనకి ఇవి చివరి ఎన్నికలని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తులసి నీళ్లు పోస్తే బతుకుతానని చంద్రబాబు తనకి తానే చెప్పుకుంటున్నారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబు పోటీ చేయకపోతే ఎవరికీ నష్టం లేదని, ఆయన ఎవర్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అధికారం కోసం భార్యను కూడా బజారుకి లాగుతున్నారని అన్నారు అమర్నాథ్. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాలన్నారు. అలా చెప్పలేకపోతే 2024 ఎన్నికలే చంద్రబాబు చివరి ఎన్నికలు అవుతాయన్నారు.