Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చెప్పుకోలేడు.. పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోలేడు

పవన్‌–బాబు కూటమికి కష్టాలు చెప్పే వచ్చాయి. పైగా కలిసికట్టుగా కూడా వచ్చాయి. బీజేపీ వాదన, కాపుల వేదన పవన్‌ కల్యాణ్‌ని ఇప్పుడే తేల్చుకో, నౌ ఆర్‌ నెవ్వర్‌ అంటున్నాయి.

చంద్రబాబు చెప్పుకోలేడు.. పవన్‌ కల్యాణ్‌ ఒప్పుకోలేడు
X

అనుకున్నంత అయింది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అపూర్వ స్నేహం కష్టాల్లో పడుతోంది. మాట్లాడుకుంటేనో, చర్చలు జరిపితేనో ఒక కొలిక్కివచ్చే సమస్య కాదిది. బీజేపీ పెద్దలతో కీలకమైన చర్చలు జరపడానికి పవన్‌ ఢిల్లీ వెళ్లబోతున్నారు.

బీజేపీ మొదటి నుంచీ ఒక్కమాట మీదే ఉంది. చంద్రబాబుకి దూరంగా ఉందాం, జనసేనతో కలిసి పనిచేద్దాం అనేది కమలనాధుల నిశ్చితాభిప్రాయం. బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూలేదు. బీజేపీ మాత్రం పవన్‌ పక్కనే స్థిరంగా నిలబడింది. తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకురమ్మని పవన్‌కి సున్నితంగా చెప్పింది కూడా. ఆంధ్రలో కొద్దిపాటి బలం ఉన్న రెండు కమ్యూనిస్టు పార్టీలూ, బీజేపీని దూరం పెట్టమని చంద్రబాబుని అడుగుతున్నాయి. ఇక్కడ ఇరుక్కుపోయింది చంద్రబాబు ఒక్కడే కాదు. పవన్‌ కల్యాణ్‌కి కూడా దిక్కుతోచడం లేదు. వైఎస్‌ కూతురు షర్మిల, బీజేపీని చెత్తకింద తిడుతోంది. అమెతో అలా మాట్లాడిస్తున్నది చంద్రబాబే అని అంటున్నారు. మరోపక్క చిటికేస్తే లక్షల జనం వస్తున్నారు కనుక జనసేనకి తెలుగుదేశం వాళ్లు టికెట్లు ఇవ్వడం ఏమిటని పవన్‌ కల్యాణ్‌ని మిత్రులు అడుగుతున్నారు.

63 మంది అభ్యర్థుల జాబితాని చంద్రబాబుకి పవన్‌ ఇచ్చారు. ఏడెనిమిది పార్లమెంట్‌ స్థానాలనూ జనసేన అడిగేస్తోంది. రాష్ట్రమంతా విస్తరించి, మెజారిటీ సంఖ్యలో ఉన్న కాపులు సీట్ల కోసం ఎవర్నో అర్థించడం అర్థంలేని పని అని కాపు యాక్టివిస్టులు విమర్శిస్తున్నారు. ‘‘తప్పదు, చంద్రబాబుతో తెగతెంపులు చేసుకోండి’’ అని ఢిల్లీ పెద్దలు కచ్చితంగా చెబితే పవన్‌ ఏమంటారు..? చంద్రబాబుతో చెట్టాపట్టాల్‌ వేసుకు తిరుగుతున్న పవన్‌ ఈ విషమ పరీక్షని ఎలా ఎదుర్కొంటారు..?

జనసేన, బీజేపీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులూ... ఈ నాలుగు కత్తులూ ఒక ఒరలో ఇమడవు అని చెప్పడానికి గొప్ప రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదుగా. తెలుగుదేశం కమ్యూనిస్టులు, జనసేన బీజేపీ, జగన్‌ వైఎస్సార్‌ సీపీల మధ్య ముక్కోణపోటీ జరిగితే మళ్లీ జగనే గెలుస్తాడుగా.. అని పవన్‌ కల్యాణ్‌ అంటే బీజేపీ ఏమీ ఆశ్చర్యపోదు. చంద్రబాబు కంటే జగనే మేలు అని బీజేపీ భావన. బాబు ఓడిపోతాడేమోనని పవన్‌ గింజుకోవచ్చు, బీజేపీ మాత్రం ఆనందిస్తుంది. జగన్‌ ఒకపక్క అభ్యర్థుల్ని ప్రకటిస్తూ దూకుడు మీద ఉంటే, జనసేన–టీడీపీ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. ప్రతిపక్షాన్ని ఐక్యంగా నిలబెట్టి జగన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న చంద్రబాబు గేమ్‌ప్లాన్‌ బెడిసికొట్టిన సూచనలు కనిపిస్తున్నాయి.

పవన్‌–బాబు కూటమికి కష్టాలు చెప్పే వచ్చాయి. పైగా కలిసికట్టుగా కూడా వచ్చాయి. బీజేపీ వాదన, కాపుల వేదన పవన్‌ కల్యాణ్‌ని ఇప్పుడే తేల్చుకో, నౌ ఆర్‌ నెవ్వర్‌ అంటున్నాయి. కమ్యూనిస్టుల మాట, జనసేన డిమాండ్లు బాబుకి నిద్రపట్టకుండా చేస్తున్నాయి. కళ్లముందే నడుస్తున్న ఈ రాజకీయ మెలో డ్రామాని చూస్తూ, ఎంజాయ్‌ చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఎత్తుగడల్తో రంగంలోకి గట్టి అభ్యర్థుల్ని దించే పనిలో ఉన్నారు. బీజేపీ, కాపుల పంతం నెగ్గి, పవన్‌ చంద్రబాబుకి దూరం అయితే, జగన్‌ పంటపండినట్టే..! మరొక్కసారి తెలుగుదేశం ప్రతిపక్షంగా మిగిలినట్టే..! ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చివరికి నరేంద్రమోడీ గెలుస్తున్నాడని మీకు అనిపిస్తే, మీరు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టే..

First Published:  26 Jan 2024 10:09 AM GMT
Next Story