ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు, పవన్
ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షాలతో సమావేశం నిర్వహించనుంది NDA. ఈ సమావేశానికి చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ హాజరుకానున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ నేతృత్వంలో జరిగే NDA కూటమి సమావేశానికి ఈ ఇద్దరు నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ఈ ఇద్దరు నేతలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం.
బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం అనివార్యమైంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీకి మరో 31 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రభుత్వ ఏర్పాటుపై మిత్రపక్షాలతో సమావేశం నిర్వహించనుంది NDA. ఈ సమావేశానికి చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ హాజరుకానున్నారు. NDAకు మద్దతుగా ఈ ఇద్దరు నేతలు లేఖలు ఇస్తారని తెలుస్తోంది.
మరోవైపు ఇండియా కూటమి సైతం ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహించనుంది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 39 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. చంద్రబాబును సంప్రదించారన్న వార్తలను ఇండియా కూటమి నేతలు కొట్టిపారేశారు. మీటింగ్ తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.