ఈ మౌనం, ఈ నిశ్శబ్దం దేనికి సంకేతం..!
ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీని సత్కరిస్తారు అని అనౌన్స్ చేశారు. బాబు లేచి నిల్చున్నారు, ప్రధాని సిద్ధం అయ్యారు. సత్కరించడానికి శాలువా లేదు. ఒక్క క్షణం బిత్తరపోయిన మోదీ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్బుతం జరిగింది. శక్తిమంతుడైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా హారతులందుకున్న చంద్రబాబు నాయుడు, ప్రజల్ని ఉద్వేగంతో ఊగించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు కలిపారు. ఎన్నికల్లో కలిసి పోటీచేద్దాం అని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు పంచుకున్నారు. ఇది చాలా విశేషం. ఎందుకు..? తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పొసగదు. చంద్రబాబు నాయుడి కమ్మ పార్టీకీ, పవన్ కళ్యాణ్‌ని ఆరాధించే కాపులకీ పడనే పడదు. అయినా జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలనే పవిత్ర ఆశయ సిద్ధి కోసం ఈ ముగ్గురు కలిశారు. నిస్సందేహంగా ఇది పవర్ ఫుల్ కాంబినేషన్. ఈ శక్తి సంపన్నమైన త్రిశూలం ఎంతటి మొనగాడినైనా మట్టి కరిపించగలదు. మ్యాజిక్ చేయగలదు.
బలప్రదర్శనలో భాగంగా, చిలకలూరిపేటకి ప్రధాని మోదీని రప్పించి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అటు పవన్, ఇటు చంద్రబాబు, ఇక బ్రహ్మాండం బద్దలవుతుంది అనుకుంటే, చూస్తుండగానే తస్సుమంది ఆ సభ.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీని సత్కరిస్తారు అని అనౌన్స్ చేశారు. బాబు లేచి నిల్చున్నారు, ప్రధాని సిద్ధం అయ్యారు. సత్కరించడానికి శాలువా లేదు. ఒక్క క్షణం బిత్తరపోయిన మోదీ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛం అందజేస్తారు అని ప్రకటించారు. పవన్ రెడీ అయ్యారు. అక్కడ పువ్వులూ లేవు, గుచ్ఛమూ లేదు. మోదీ అవాక్కయ్యారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి వస్తే, ఇంత దారుణమైన వైఫల్యం ఎందుకు జరిగింది..? ఎవరు బాధ్యులు..? ప్రధాని మొహంలో నెత్తుటి చుక్కలేదు. అసహనంతో మోదీ రగిలిపోతున్నారని తెలిసిపోతూనే ఉంది. అక్కడితోనే అయిపోయిందా..? లేదు. ప్రధాని ప్రసంగించడానికి లేచారు. మైక్ ముందుకి వచ్చారు. నాలుగు మాటలు మాట్లాడగానే మైక్ కట్ అయిపోయింది. అలా వరసగా మైక్ మూడుసార్లు కట్ అయింది.
ప్రధాని ప్రసంగంలో జగన్మోహన్‌రెడ్డిని ఉతికి ఆరేస్తారని అనుకున్నారు. అలాంటిదేమీ జరగలేదు. మేం ముగ్గురం కలిసి పొడిచేస్తాం లాంటి పెద్ద మాటలూ మాట్లాడలేదు. సభలో బీజేపీ జెండాలు నాలుగో అయిదో ఉన్నాయి. తెలుగుదేశం షో అని తెలుస్తూనే ఉంది. చివరికి చిలకలూరిపేట సభ మూడు పార్టీలకూ నిరాశనే మిగిల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన నరేంద్ర మోదీ ‘‘ఏమిటీ నిర్వాకం’’ అని గట్టిగానే అడిగారు. అట్టర్ ఫ్లాప్ అయిన ఈ ఒక్క సభ గురించి మాత్రమే కాదు, ఎట్టకేలకు పొత్తు పొడిచినా, ఆ ఆనందం ఎక్కడా కనిపించలేదు.
ఎందుకలా జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్‌లో బలహీనమైన బీజేపీకి అన్ని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు ఇవ్వడం, టీడీపీ ఆశావహులని ‘హర్ట్’ చేసింది. జనసేన పార్టీకి ఇచ్చిన స్థానాల్లో పాతుకుపోయి ఉన్న పాత తెలుగుదేశం నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. బీజేపీ పక్షాన, పవన్ వెంట ఉన్న కాపులు టీడీపీ అనే కమ్మ పార్టీ అంటేనే చిరాకు పడుతున్నారు. బీజేపీ, టీడీపీలకు సంధి కుదిర్చిన మొనగాడు అంటూ ఎవరూ పవన్ కళ్యాణ్‌ని మెచ్చిమేకతోలు కప్పలేదు. ఒక రకమైన నిరాశ, నిశ్శబ్దం ఈ మూడు పార్టీలనీ ఆవరించి ఉంది. ఆసక్తికరమైన ఈ రాజకీయ దొంగాటలో పాపం లోకేష్ బాబు అనేవాడు ఆటలో అరటిపండుగా మిగిలిపోయాడు. చంద్రబాబు ప్రసంగాల్లో బెదిరింపులూ, హెచ్చరికలూ తప్ప పసలేదు. ఇటు, కాపుల విముక్తి ప్రదాతగా పోజు కొడుతున్న పవన్ కళ్యాన్ని పట్టించుకోకుండా కాపు నాయకులు జగన్ వైసీపీలో చేరిపోతున్నారు. పొత్తు కట్టిన మూడు రాజకీయ ముఠాలూ అసంతృప్తిలో రగిలిపోతుంటే, ఒంటరివాడైన జగన్మోహన్‌రెడ్డి నిశ్చింతగా ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న సీపీఐ, సీపీఎం నాయకులు చంద్రబాబునీ, మోదీనీ కలిపి తిడుతున్నారు. ఇది ‘అక్రమ సంబంధం’ అంటున్నారు.
ఇంతకీ, చెవిలో పువ్వు పెట్టుకుని, గ్లాసులో చాయ్ తాగుతున్న టీడీపీ కార్యకర్తల్ని ఈ రాజకీయ పొత్తు అనే త్రిశూలం, ఈ సారి గెలిపిస్తుందా..? లేక చంద్రబాబు నాయుడి రాజకీయ ఆత్మహత్యకి ఆయుధంగా ఉపయోగపడుతుందా..?
జగన్నాథ రథచక్రాలు వేలంగా వస్తున్న చప్పుడు మీకు వినిపిస్తోందా..?