జగన్ బాటలోనే చంద్రబాబు, పవన్?
తన పర్యటనల్లో చంద్రబాబు ఉత్తరాంధ్రకు అందులోనూ విశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక పవన్ కూడా వారాహి యాత్రను ఉత్తరాంధ్రలోనే చేస్తున్నారు.
చంద్రబాబునాయుడు మెంటల్‌గా ఫిక్సయిపోయినట్లే ఉన్నారు. తొందరలోనే తాను కూడా విశాఖపట్నం వెళ్ళక తప్పదని అర్థమైపోయినట్లుంది. ఎందుకంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జగన్ వైజాగ్‌కు మారటం ఖాయమనే అనిపిస్తోంది. మూడు రాజధానుల వ్యవహారం కోర్టు విచారణలో ఉంది కాబట్టి వైజాగ్‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పిలిచేందుకు లేదు. అందుకనే ముఖ్యమంత్రి హోదాలో జగన్ విశాఖకు మారిపోతున్నారు. సీఎంగా తనిష్టం వచ్చినచోట జగన్ ఉండవచ్చు.
ఇక్కడే కూర్చుని పరిపాలన చేయాలని ఏ కోర్టు కూడా జగన్‌ను నిర్దేశించలేదు. అందుకనే జగన్ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఒకసారి జగన్ వైజాగ్ వెళ్ళిపోతే మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం అంతా అక్కడికే వెళ్ళిపోతుంది. ముఖ్యమంత్రి విశాఖలో ఉంటే ఇక అమరావతిలో ఉండేదెవరు? ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు అందరు వైజాగ్‌లోనే ఉంటారు. అప్పుడు వైజాగ్ కేంద్రంగా పొలిటికల్ యాక్టివిటి బాగా పెరిగిపోతుంది. దాంతో ఏదో రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా విశాఖకు వెళ్ళక తప్పదు.
ఈ విషయంలోనే చంద్రబాబు ముందుగానే ప్రిపేర్ అయినట్లున్నారు. అందుకనే ఆగస్టు 15న విజన్-2047 పేరుతో వైజాగ్‌లో ఒక కార్యక్రమం చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బీచ్ రోడ్డులోని ఎన్టీయార్ విగ్రహం దగ్గర నుండి సుమారు 2 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నారు. అన్నీవర్గాలు తనకు మద్దతివ్వాలని, అందరు పాల్గొనాలని చంద్రబాబు పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా పిలుపిచ్చారు.
మామూలుగా అయితే చంద్రబాబు ఆగస్టు 15న మంగళగిరిలోని పార్టీ ఆఫీసులోనే ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఉదయం జెండా వందనం అయిపోగానే వైజాగ్ బయలుదేరుతున్నారు. బహుశా రాత్రికి వైజాగ్‌లోనే ఉండచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొన్న ఐదు రోజులు ఉత్తరాంధ్రలోనే చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. తన పర్యటనల్లో చంద్రబాబు ఉత్తరాంధ్రకు అందులోనూ విశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక పవన్ కూడా వారాహి యాత్రను ఉత్తరాంధ్రలోనే చేస్తున్నారు. పవన్ కూడా విశాఖకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తానికి జగన్ దారిలోనే చంద్రబాబు, పవన్ నడవక తప్పని పరిస్థితులు వస్తున్నట్లు అర్థమవుతోంది.