నావి 6, పవన్ వి 4, మోదీవి 14.. లెక్కలు చెప్పిన చంద్రబాబు
కేంద్రం యువశక్తి పథకం తీసుకువస్తోందని, టీడీపీది యువగళం అని, ఆ రెండు కలిపితే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు.
బీజేపీ మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే ఏపీలో సూపర్-6 పేరుతో మేనిఫెస్టో తీసుకువచ్చామని, తన మిత్రుడు పవన్ కల్యాణ్ 6 కాదు సార్ 10 ఇద్దాం అని అన్నారని, తాను కూడా ఓకే చెప్పానని వివరించారు. ఇక బీజేపీ కూడా 14 అంశాలతో మేనిఫెస్టో రూపొందించిందని ఇవన్నీ కలుపుకొంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు పథకాల పేరు చెప్పి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
కేంద్రం యువశక్తి పథకం తీసుకువస్తోందని, టీడీపీది యువగళం అని, ఆ రెండు కలిపితే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇప్పిస్తామంటూ పాత పాటే పాడారు. అధికారంలోకి వచ్చాక నెలకు రూ.4 వేల పెన్షన్ ను ఇంటి వద్దకే అందిస్తామన్నారు. జూన్ లో అధికారంలోకి వచ్చాక, ఏప్రిల్, మే నెలకి కూడా రూ.4వేలు చొప్పున లెక్కగట్టి బ్యాలెన్స్ జూన్ లో ఇచ్చేస్తామంటూ తాయిలాలు ప్రకటించేశారు చంద్రబాబు.
సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. కొత్త డ్రామాలతో ముఖ్యమంత్రి ప్రచారానికి వస్తున్నారని ఆరోపించారు. జగన్ లాంటి దుర్మార్గుడు వస్తాడని అంబేద్కర్ ఏనాడో చెప్పారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశారని, కొండలను మింగేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో 40 వేల కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. ఇప్పుడు డ్రామాలకు తెరతీశారని, మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు చంద్రబాబు.