రాష్ట్ర ప్రయోజనాల కోసమే యజ్ఞాలు, హోమాలు, పూజలు.. చంద్రబాబు కామెడీ
మంగళగిరి కార్యాలయంలో పలువురిని టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్ ను ప్రజలు క్షమించరని శాపనార్థాలు పెట్టారు.
ఇటీవల పూజలు, యజ్ఞాలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు. చివరి అవకాశం, ఈసారి అధికారంలోకి రాకపోతే టీడీపీ భూస్థాపితం అనే ఉద్దేశంతోటే ఆయన యజ్ఞాలతో బిజీగా ఉన్నారని సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు మాత్రం తన పూజలు, పునస్కారాలాన్నీ రాష్ట్ర ప్రయోజనాలకోసమేనంటూ కామెడీ మొదలు పెట్టారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ పూజలు ఎందుకు చేయలేదు, పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్నిరోజులూ ఎందుకు సైలెంట్ గా ఉండి, సరిగ్గా ఎన్నికల ముందే ఈ పూజలు ఎందుకు మొదలు పెట్టారో చెప్పాలంటున్నారు నెటిజన్లు. ప్రజలకోసం చంద్రబాబు పూజలు చేస్తారంటే నమ్మే అమాయకులు ఎవరూ లేరంటున్నారు. గతంలో దుర్గగుడిలో చేసిన క్షుద్ర పూజలు కూడా ప్రజలకోసమేనా అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
మంగళగిరి కార్యాలయంలో పలువురిని టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన జగన్ ను ప్రజలు క్షమించరని శాపనార్థాలు పెట్టారు. జగన్ సినిమా అయిపోయిందని, ఆ విషయం ఆయనకు కూడా అర్థమైందన్నారు. అందుకే వైసీపీ నుంచి రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయన్నారు చంద్రబాబు. ప్రజలు జగన్ నే మార్చాలని నిర్ణయించినప్పుడు ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమని ఎద్దేవా చేశారు.
మద్యపాన నిషేధంపై సూటి ప్రశ్న..
ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని 2019లో చెప్పిన జగన్, ఇప్పుడు ప్రజలకు ఏమని బదులిస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. ఏళ్ల తరబడి మద్యం తాగించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ పారిపోయాయని, యువతకు ఉద్యోగాలు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోనే రూ.40వేల కోట్ల భూ కబ్జాలు జరిగాయని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకపోతే, వారి జీవితాలకు వారే మరణ శాసనం రాసుకున్నట్టని అన్నారు చంద్రబాబు.
ఆ హామీ మాదే..
ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించబోతోందంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై చంద్రబాబు స్పందించారు. అది తమ మేనిఫెస్టో హామీ అని, దాన్ని వైసీపీ,, ఎన్నికలకు ముందే కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారాయన. ఓటమి భయంతోనే తమ హామీ కాపీ కొట్టారన్నారు.