Telugu Global
Andhra Pradesh

ఫూలే జయంతి రోజున బీసీల చెవిలో చంద్రబాబు పూలు

2019లో కూడా ఇలాంటి హామీలే ఇచ్చినా.. ప్రజలు తెలివిగా చంద్రబాబుని పక్కనపెట్టారు. ఈసారి హామీల విషయంలో మరింత విజృంభిస్తున్నారు.

ఫూలే జయంతి రోజున బీసీల చెవిలో చంద్రబాబు పూలు
X

అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ చక్కటి సందర్భాన్ని ఎంచుకుంటారు చంద్రబాబు. తాజాగా ఆయన మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా బీసీల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేశారు. బీసీలకు అనేక వరాలు ప్రకటించారు. 50ఏళ్లకే బీసీలకు సామాజిక పెన్షన్ అనేది అందులో అతి ముఖ్యమైన అబద్ధపు హామీ.

కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ని రూ.4వేలకు పెంచుతానంటూ గతంలోనే హామీ ఇచ్చారు చంద్రబాబు. సామాజిక పెన్షన్ కు అర్హత 60 సంవత్సరాలు కాగా.. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ మొదలు పెడతామని తాజాగా హామీ ఇచ్చారు. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలను అందజేస్తామన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి, పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని, పెళ్లి కానుక రూ.లక్షకు పెంచి ఇస్తామని భరోసా ఇచ్చారు. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామని కూడా చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు చంద్రబాబు.

సూపర్ సిక్స్ హామీలను ఎవరూ నమ్మడంలేదని గ్రహించిన చంద్రబాబు.. సంక్షేమ పథకాల విషయంలో ఉదారత చూపిస్తూ కొత్త ఎత్తుగడ వేశారు. పెన్షన్ ని రూ.4వేలకు పెంచుతామని చెప్పడంతోపాటు, వికలాంగులకు రూ.6వేలు పెన్షన్ ఇస్తామన్నారు, తాజాగా బీసీలకు వయోపరిమితి తగ్గించారు. వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10వేలకు పెంచి ఇస్తామని చెప్పడం కూడా ఈ గేమ్ ప్లాన్ లో భాగమే.

చంద్రబాబు హామీలను నమ్మేదెవరు..?

2014లో కూడా చంద్రబాబు ఇలాంటి హామీలే ఇచ్చారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి చాలా కథలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి కొర్రీలు వేసి రైతుల్ని దారుణంగా మోసం చేశారు, నిరుద్యోగ భృతి చివరి ఏడాదిలో మొదలు పెట్టి యువతను వంచించారు. ప్రత్యేక హోదాపై పిల్లిమొగ్గలు వేయడం, పోలవరం సహా ఇతర ప్రాజెక్ట్ లేవీ పూర్తి చేయకపోవడం, అమరావతి పేరుతో నిధులు బొక్కేయడంతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు చంద్రబాబు. 2019లో కూడా ఇలాంటి హామీలే ఇచ్చినా.. ప్రజలు తెలివిగా బాబుని పక్కనపెట్టారు. ఈసారి హామీల విషయంలో మరింత విజృంభిస్తున్నారు బాబు. ఈ మాయ మాటలకు ప్రజలు బుట్టలో పడే పరిస్థితి ఇప్పుడు లేదు.

First Published:  11 April 2024 5:37 PM IST
Next Story