Telugu Global
Andhra Pradesh

జగన్ కి 7 ప్రశ్నలు.. సెల్ఫ్ గోల్ వేసుకున్న బాబు

రాప్తాడు రోడ్ షో లో సీఎం జగన్ కి 7 ప్రశ్నలు సంధించారు చంద్రబాబు. ఈ 7 ప్రశ్నలతో జగన్ ని టార్గెట్ చేయడం అటుంచి, తనకు తానే బాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది.

జగన్ కి 7 ప్రశ్నలు.. సెల్ఫ్ గోల్ వేసుకున్న బాబు
X

ప్రజాగళం యాత్రలో భాగంగా రెండోరోజు మరింత ఆవేశంగా ప్రసంగిస్తున్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందన్నారు. రాష్ట్రం విధ్వంసంపాలయిందని, పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని ప్రజల్ని కోరారు. రాప్తాడు రోడ్ షో లో సీఎం జగన్ కి 7 ప్రశ్నలు సంధించారు చంద్రబాబు.

1. ప్రత్యేక హోదా ఏది జగన్..?

ఈ ప్రశ్నకు ముందు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు. ఎన్డీఏ కూటమిలో ఉంటూ ప్రత్యేక హోదా విషయంపై డిమాండ్ చేయకుండా, ప్యాకేజీకోసం కక్కుర్తి పడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది చంద్రబాబు. ఇప్పుడు జగన్ ని ప్రత్యేక హోదా గురించి అడిగే అర్హత చంద్రబాబుకి లేదనేది ప్రజల సమాధానం.

2. సీపీఎస్ రద్దు ఏమైంది..?

ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పిన మాట వాస్తవమే. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) పునరుద్ధరించడం సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వ విధానాలు అడ్డుగా ఉన్నాయని, కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు తేల్చి చెప్పడంతో జగన్ ఆలోచించారు. అంతకంటే మెరుగైన జీపీఎస్ తీసుకొచ్చారు. ఉద్యోగులు ఒప్పుకున్నారు, కొంతమంది టీడీపీ ప్రేరేపిత ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇక్కడ సమస్య పరిష్కారమైంది, కానీ చంద్రబాబు లాంటి నాయకులకు కడుపుమంట చల్లారలేదు.

3. మద్యపాన నిషేధం ఏమైంది..?

మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కాబట్టే తన హామీలు 99 శాతం మాత్రమే అమలయ్యాయని చెబుతున్నారు సీఎం జగన్. అయితే మద్య నియంత్రణ చేశామని వైసీపీ గర్వంగా చెబుతోంది. తాను అధికారంలోకి వస్తే మంచి మంచి బ్రాండ్లు అందుబాటులోకి తెస్తానంటున్న చంద్రబాబుకి మద్య నిషేధంపై నోరేత్తే అర్హత లేదనేది ప్రజల సమాధానం.

4. ఏటా జాబ్ క్యాలెండర్..

ప్రతి ఏటా ఖాళీలు ఇవీ అంటూ జ్యాబ్ కాలెండర్ విడుదల చేయలేకపోవచ్చు కానీ అధికారంలోకి రాగానే లక్షకు పైగా సచివాలయ పోస్ట్ లు సృష్టించి మరీ భర్తీ చేసిన ఘనత జగన్ కి మాత్రమే దక్కుతుంది. జగన్ హయాంలో గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్స్.. అన్నిరకాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కేవలం బురదజల్లడానికే ఈ ప్రశ్న అడిగారు కానీ ఇందులో పస లేదనేది వాస్తవం.

5. మెగా డీఎస్సీ..

నాడు-నేడు పనులతో స్కూళ్ల రూపు రేఖలు మార్చారు జగన్. ఇంగ్లిష్ మీడియం తెస్తే కడుపు మంటతో కోర్టుకెళ్లింది పచ్చ బ్యాచ్. ముందు స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించడం జగన్ ప్రణాళిక. అనుకున్నట్టుగానే ఇప్పుడు డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు వచ్చాయి. అంటే ఈప్రశ్న అర్థరహితం.

6. కరెంటు చార్జీల తగ్గింపు..

కరెంటు ఉత్పత్తి ఖర్చు పెరిగితే కచ్చితంగా చార్జీలు కూడా పెరుగుతాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందులో చేయగలిగిందేమీ లేదు. కరెంటు చార్జీలు పెంచి, నిరసన తెలిపిన ప్రజలను గుర్రాలతో తొక్కించి, పోలీసులతో కాల్పులు జరిపించిన చంద్రబాబు లాంటి వ్యక్తికి కరెంటు చార్జీల పేరెత్తే అర్హత కూడా లేదనేది ప్రజల సమాధానం.

7. పోలవరం ఎప్పుడు..?

కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ ని తన సొంత ప్రయోజనాలకోసం రాష్ట్రమే నిర్మిస్తుందంటూ ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నారు చంద్రబాబు. తీరా తన హయాంలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఆయనకు చేతకాలేదు. పోలవరం పేరుతో ఆడిన డ్రామాలన్నీ ప్రజలకు తెలుసు కాబట్టే కర్రు కాల్చి వాత పెట్టారు. 23 స్థానాలకు పరిమితం చేశారు. కరోనా లాంటి ఇబ్బందులెదురైనా కేంద్రం సహాయ నిరాకరణ చేసినా వైసీపీ హయాంలో పోలవరం నిర్మాణం జోరందుకుంది. ఈ విషయంలో కూడా చంద్రబాబుకి ప్రశ్నించే అర్హత లేదని ప్రజలు అంటున్నారు.

ఈ 7 ప్రశ్నలతో జగన్ ని టార్గెట్ చేయడం అటుంచి, తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు చంద్రబాబు. తన హయాంలో ఏం జరిగిందో చెప్పుకోలేని బాబు, జగన్ పై నిందలు వేయడానికి మాత్రం ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తున్నారు.

First Published:  28 March 2024 4:44 PM IST
Next Story