Telugu Global
Andhra Pradesh

బాబు ఇస్తాడు సరే, తీసుకునేవారేరి..?

బాబు, బాలయ్యని పక్కనపెడితే టీడీపీకి నికరంగా ఉన్న ఎమ్మెల్యేలు 17మంది. పార్టీలేదు బొక్కాలేదు అన్న అచ్చెన్నాయుడు, అలిగి పార్టీనుంచి బయటకు వెళ్లినంత పని చేసిన బుచ్చయ్య చౌదరి.. ఇలా చాలామందికి సొంత పార్టీపై సదభిప్రాయం లేదు.

బాబు ఇస్తాడు సరే, తీసుకునేవారేరి..?
X

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చేసారి కచ్చితంగా టికెట్లు ఇస్తామంటూ రెండుసార్లు ప్రకటించారు చంద్రబాబు. అదేదో గొప్ప అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంది కూడా. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా సిట్టింగ్ వ్యూహం ఫలించిందని, ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ఆయన విజయం సాధిస్తారని గొప్పలు చెప్పుకున్నారు. ఇంతకీ సిట్టింగ్ వ్యూహం చంద్రబాబుకి బలమా, బలహీనతా..? తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబు సిట్టింగ్ లకు సీట్లు ఇస్తానని ప్రకటించారని కొందరు అంటున్నారు. అది బాబు బలం కాదని, బలహీనత అని చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలొచ్చాయి. అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ సానుభూతి పరులుగా మారారు. అంటే టీడీపీకి మిగిలిన స్థానాలు 19. చంద్రబాబు, బాలకృష్ణను మినహాయిస్తే మిగిలింది 17మంది. ఈ 17మంది వైసీపీ గాలి బలంగా వీచినా గెలిచారు. కొన్నిచోట్ల త్రిముఖ పోరులో లాభపడ్డారు, వైసీపీ అభ్యర్థుల బలహీనతతో బతికి బయటపడ్డారు. ప్రస్తుతానికయితే టీడీపీ తరపున పోటీ చేయడానికి ఎవరూ ఉత్సాహంగా లేరనే చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థుల్ని వెతికి పెట్టుకోవాల్సి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో పనబాక లక్ష్మిని బతిమిలాడి చంద్రబాబు పోటీకి దింపారు. బద్వేలు, ఆత్మకూరు విషయంలో పోటీ లేదు కాబట్టి చంద్రబాబుకి అభ్యర్థుల్ని వెతికే ఇబ్బంది తప్పింది. సో.. టీడీపీ తరఫున పోటీ చేయడానికి కాంపిటీషన్ లేదు, అంటే సిట్టింగ్ లు మినహా టీడీపీ గెలిచిన స్థానాల్లో వారికి ఆల్టర్నేట్ లేదని చెప్పాలి. అందుకే చంద్రబాబు సిట్టింగ్ వ్యూహం అంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకున్నారు.

బాబు ఇచ్చినా తీసుకునేవారేరి..?

బాబు, బాలయ్యని పక్కనపెడితే టీడీపీకి నికరంగా ఉన్న ఎమ్మెల్యేలు 17మంది. పార్టీలేదు బొక్కాలేదు అన్న అచ్చెన్నాయుడు, అలిగి పార్టీనుంచి బయటకు వెళ్లినంత పని చేసిన బుచ్చయ్య చౌదరి.. ఇలా చాలామందికి సొంత పార్టీపై సదభిప్రాయం లేదు. 2024 ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత దిగజారితే సిట్టింగ్ లు కూడా పోటీ చేసే సాహసం చేయరు. సో చంద్రబాబు వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ లు వెనకంజ వేస్తే అప్పుడు అభ్యర్థుల్ని వెతుక్కోవాలి చంద్రబాబు.

మేకపోతు గాంభీర్యమే..

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై మరీ అంత వ్యతిరేకత లేదనేది సర్వేల సారాంశం. గెలిచిన 151 స్థానాలు, ఇతర పార్టీలనుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిపితే వైసీపీ ప్రస్తుత బలం 156. ఒకవేళ మరీ వ్యతిరేకత ఉన్నా వైసీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనంత తక్కువ సీట్లయితే రావు. ప్రతిపక్షాలన్నీ ఐక్యతా రాగం పాడుతున్నా.. వారిలో వారికి సవాలక్ష కుమ్ములాటలున్నాయి. సో.. 2024లో చంద్రబాబు అధికారంలోకి రావడం అసాధ్యం. అయినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు బాబు. సిట్టింగ్ లకే టికెట్లు అంటూ రెండేళ్ల ముందుగానే ప్రకటించి, అదో పెద్ద వ్యూహం అనుకోమంటున్నారు.

First Published:  18 Sept 2022 1:15 PM IST
Next Story