సాక్షి అయితే లాగి పడేయండి.. కుప్పంలో చిందులు తొక్కిన చంద్రబాబు
తన రోడ్ షో లకు, సభలకు స్వచ్ఛందంగా యువత, రైతులు, వస్తున్నారని, అందుకే జగన్ లో వణుకు పుట్టి జీవో తెచ్చారని విమర్శించారు చంద్రబాబు. తన నియోజకవర్గంలో తనను నడిరోడ్లో నిలబెడతారా అని ప్రశ్నించారు.
అనుమతి లేదని తెలుసు, పర్యటనకు వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని కూడా తెలుసు. అయినా చంద్రబాబు కుప్పం వెళ్లారు. సొంత నియోజకవర్గంలో రచ్చ చేయాలని చూశారు, చివరకు అనుకున్నది సాధించారు. కుప్పంలో పోలీసులు లాఠీచార్జీ చేశారంటూ టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తోంది. ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చివరకు చంద్రబాబు, మీడియా ముందుకొచ్చి రెచ్చిపోయారు. నా నియోజకవర్గంలో నన్నెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారాయన.
సాక్షిని లాగిపడేయండి..
చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతలు.. పోలీసులపై తిరగబడ్డారని సాక్షి మీడియాలో వార్తలొచ్చాయి. చంద్రబాబు పర్యటనలో కూడా సాక్షి మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే వారిని అడుగడుగునా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు కూడా ఓ దశలో సాక్షిపై మండిపడ్డారు. సాక్షి వాళ్లుంటే లాగిపడేయండి అన్నారు. సాక్షి ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడతారని, బయట తిరగలేరని హెచ్చరించారు.
పోలీస్ యాక్ట్ అమలులో ఉంటే ప్రత్యేకంగా జీవో ఎందుకు తెచ్చారు, చట్టం అమలు లేకపోతే ఏ చట్టం ప్రకారం జీవో తెచ్చారో చెప్పాలంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తన రోడ్ షో లకు, సభలకు స్వచ్ఛందంగా యువత, రైతులు, వస్తున్నారని, అందుకే జగన్ లో వణుకు పుట్టి జీవో తెచ్చారని విమర్శించారు. తన నియోజకవర్గంలో తనను నడిరోడ్లో నిలబెడతారా అని ప్రశ్నించారు. పోలీసులు తనను రోడ్ షో చేయొద్దని అంటున్నారని, ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలవాలని సూచించారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు ప్రజల వద్దకు ఎలా వెళ్లాలో తెలియదా అని ప్రశ్నించారు.
మొత్తమ్మీద చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన ఏం కావాలని అనుకున్నారో అది ఈరోజు జరిగింది. వరుసగా రెండు దుర్ఘటనలతో చంద్రబాబు పర్యటనలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకుంటున్న టైమ్ లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోతో చంద్రబాబు హడావిడి మొదలు పెట్టారు. కుప్పంలో తనను అడ్డుకుంటున్నారని సింపతీ క్రియేట్ చేసుకున్నారు.