సైకిల్ గాలి వీస్తోంది తమ్ముళ్లూ..!! వైసీపీ కొట్టుకుపోతుంది..
రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ గాలి వీస్తోందని, ఆ గాలికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు చంద్రబాబు. వైసీపీ అసమర్థ పాలన వల్ల ప్రజలు తిరిగి టీడీపీయే రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
చంద్రబాబు పర్యటనలు మొదలు పెట్టారు. ఇటీవల సమీక్షలతో హడావిడి చేసిన ఆయన, తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యటించారు. నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరుగుతోందని, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో సీఐడీ ఒక పనికి మాలిన శాఖగా మారిందని, తప్పు చేసిన అధికారులను తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కర్నూలు జిల్లాకు అన్యాయం జరిగిందని, సాగునీటి ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్ సహా అన్నీ నంద్యాల జిల్లాకు వెళ్లాయని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో నీటి ఎద్దడి ఉండేదని, ఇక్కడ ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది టీడీపీయేనని గుర్తు చేశారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. రోడ్లపై గుంతల్లో మట్టి వేయలేని సీఎం జగన్.. మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.
గాలి మనదే..
రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ గాలి వీస్తోందని, ఆ గాలికి వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు చంద్రబాబు. వైసీపీ అసమర్థ పాలన వల్ల ప్రజలు తిరిగి టీడీపీయే రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, దేశంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం ఏపీయేనని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణం జగనేనని విమర్శించారు. పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతుల కష్టాలను అసలు జగన్ పట్టించుకోవడంలేదని, నేరుగా ఒక్క రైతుతో కూడా ఆయన మాట్లాడలేదన్నారు. పన్నుల భారంతో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చివరకు చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అంటూ మండిపడ్డారు చంద్రబాబు.
కాంగ్రెస్ సీఎం విగ్రహానికి పూలమాల..
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడాయన వారసులు టీడీపీలో ఉన్నారు. కోడుమూరు పర్యటనలో కోట్ల ఫ్యామిలీ అభిమానుల్ని ఆకట్టుకోడానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చంద్రబాబు. విజయ భాస్కర్ రెడ్డి నీతి, నిజాయితీతో రాజకీయాలు చేశారని కొనియాడారు. కాంగ్రెస్ సీఎం ని ప్రశంసించారంటే కాంగ్రెస్ పాలనను కూడా చంద్రబాబు మెచ్చుకున్నట్టే లెక్క అంటున్నారు నెటిజన్లు.