Telugu Global
Andhra Pradesh

బాబు, హేమ.. వీళ్లను మీడియా తట్టుకోగలదా..?

ఎన్నికల తర్వాత తండ్రీకొడుకులిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటేశారనేది వాస్తవం. ఎక్కడికి అనేది మాత్రం అనుమానం.

బాబు, హేమ.. వీళ్లను మీడియా తట్టుకోగలదా..?
X

బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులకు దొరికి, అదే బెంగళూరు ఫామ్ హౌస్ నుంచి ఓ వీడియో విడుదల చేసి, హైదరాబాద్ లోనే ఉన్నట్టు నమ్మించి తెలుగు మీడియాని కొన్ని గంటల పాటు మాయ చేసింది సినీ నటి హేమ. హేమ ఇచ్చిన ట్విస్ట్ కి, పేరుగొప్ప రిపోర్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటూ ఊదరగొట్టే ఛానెల్స్ సైతం హేమ హైదరాబాద్ లోనే ఉంది అని తీర్మానం చేసేసి అదే మాయలో పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రబాబు విషయానికొద్దాం. బాబు అమెరికా వెళ్లారా, ఇటలీ వెళ్లారా, లేదా ఇంకెక్కడికైనా వెళ్లారా అనే అధికారిక సమాచారం ఎక్కడా లేదు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎక్కడికెళ్లారంటే ఏ మీడియా ఛానెల్ కూడా కరెక్ట్ గా చెప్పే పరిస్థితి లేదు. ఈ దశలో ఆయన అమెరికా వెళ్లారంటూ రెండు రోజులపాటు మీడియాని భ్రమల్లోకి నెట్టేసింది టీడీపీ. చివరికి ప్రత్యర్థిపై ఓ కన్నేసి ఉంచాల్సిన సాక్షి మీడియా కూడా బాబు అమెరికా వెళ్లారని వార్తలిచ్చేసి, ఆ తర్వాత ఇటలీ అంటూ కవర్ చేసుకోవాల్సి వచ్చింది.

జగన్ లండన్ పర్యటనను ఎల్లో మీడియా ఏ రేంజ్ లో కౌంటర్ చేసిందో అందరికీ తెలుసు. చంద్రబాబు అమెరికా పర్యటనను కూడా అదే స్థాయిలో వైసీపీ అనుకూల మీడియా టార్గెట్ చేయాలనుకుంది. కానీ కుదర్లేదు. చంద్రబాబు అమెరికా వెళ్లారంటూ మీడియాకు లీకులిచ్చారు, అదే నిజమనుకున్నారంతా, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించారని, చివరకు నానా తంటాలు పడి ఆయన దేశం దాటారన్నారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఆయన వెళ్లింది అమెరికాకు కాదు, ఇటలీకి అని తేలింది. ఇది కూడా అత్యంత విశ్వసనీయ సమాచారమే కానీ, అధికారికం కాదట. చంద్రబాబు అమెరికా రాలేదని, టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం ప్రకటించిన తర్వాత ఇటలీ వ్యవహారం బయటకొచ్చింది.

స్కిల్ స్కామ్, షెల్ కంపెనీలు..

అమెరికా వెళ్లినా, ఇటలీ వెళ్లినా.. చంద్రబాబు ప్రయాణం దుబాయ్ మీదుగా జరిగిందనేది వాస్తవం. దుబాయ్ తోనే ఆయన బంధాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలకంగా ఉందని, అక్కడినుంచే షెల్ కంపెనీల ద్వారా ఆయన అక్రమార్జన ఇతర కంపెనీల్లోకి వెళ్లిందని అంటున్నారు. అందుకే ఆయన దుబాయ్ వెళ్లారని, ఆ తర్వాత మిగతా టూర్ ప్లాన్ చేసుకున్నారని తేల్చారు. మొత్తమ్మీద చంద్రబాబు విదేశీ పర్యటనలపై కనీస సమాచారం కూడా బయటకు రాకుండా టీడీపీ మేనేజ్ చేసింది. ఎన్నికల తర్వాత తండ్రీకొడుకులిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటేశారనేది వాస్తవం. ఎక్కడికి అనేది మాత్రం అనుమానం.

First Published:  21 May 2024 1:43 AM GMT
Next Story