Telugu Global
Andhra Pradesh

ఐనప్పటికీ, జగన్‌ గెలుస్తున్నట్టే..!

చంద్రబాబు శాడిస్టు అనీ, పింఛన్లు ఆపిన పాపాత్ముడనీ జగన్‌ తిడుతుంటే, జనం ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. ఒక ఐదు సంవత్సరాల క్రితం జగన్ని చూసి జనం ఎలా ఊగిపోయారో, ఇప్పుడూ జనంలో అదే ఉత్సాహం... అదే ఉద్వేగం..!

ఐనప్పటికీ, జగన్‌ గెలుస్తున్నట్టే..!
X

జగన్‌ పరిపాలన మీద జరిగినంత దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. రాష్ట్రం నాశనం అయిపోయిందనీ, అభివృద్ధి ఆగిపోయిందనీ, పెట్టుబడులు రావడం లేదనీ, ప్రజలు అల్లాడిపోతున్నారనీ, అమరావతి ఆగం అయిపోయిందనీ, ఆంధ్రప్రదేశ్‌ పాతికేళ్లు వెనక్కి వెళిపోయిందనీ.. ఇంకా ఎన్నో ఆరోపణలు, విమర్శలు, తిట్లు!

గత ఐదేళ్లుగా ఈనాడు గ్రూపు, జ్యోతి ముఠా, కొన్ని టీవీ ఛానళ్లూ పగలూ రాత్రీ ప్రచారం హోరెత్తిస్తూనే ఉన్నాయి. ఎన్నికలు తరుముకొస్తున్నందున ఆ విషప్రచారాన్ని మరింత పెంచాయి. జగన్‌ చేసిన మంచిపని ఒక్కటీ లేదనీ, అతను రాష్ట్రానికి పట్టిన శనీ అనీ రాశాయి. ఈ ప్రచార ఎత్తుగడ ద్వారా జనాన్ని ప్రభావితం చేయడానికి పడరాని పాట్లు పడ్డాయి. జగన్‌ నీచుడనీ, సైకో అనీ, హంతకుడనీ ప్రతిరోజూ చెబుతూనే ఉన్నాయి. తెలుగుదేశం తాబేదార్ల ప్రచారం ఎంత నీచానికి ఒడిగట్టడానికైనా వెనకాడలేదు. జనం, నిజంగా ఇదంతా నమ్మి ఉంటే, వాళ్లసలు జగన్‌ ముఖం చూడకూడదు. వైఎస్సార్ పార్టీకి ఓటు వేయకూడదు.

ఇప్పుడు వాస్తవం ఏమిటో చూద్దాం..

ఉత్తరాంధ్రలో, గోదావరి జిల్లాల్లో, రాయలసీమలో జగన్‌ సభలకి జనం పోటెత్తారు. జనాన్ని తరలించారు, డబ్బులిచ్చారు, మందుపోశారు అన్నారు. అలా అయితే, అయిదు లక్షలూ ఏడు లక్షల మంది వస్తారా..?

ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర జరుగుతోంది. ఎటు చూసినా జనం. ప్రకాశం జిల్లా అంతా జగన్ని చూసేందుకూ, వినేందుకూ కెరటాలు కెరటాలై ఎగసిపడింది. చంద్రబాబు శాడిస్టు అనీ, పింఛన్లు ఆపిన పాపాత్ముడనీ జగన్‌ తిడుతుంటే, జనం ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. ఒక ఐదు సంవత్సరాల క్రితం జగన్ని చూసి జనం ఎలా ఊగిపోయారో, ఇప్పుడూ జనంలో అదే ఉత్సాహం... అదే ఉద్వేగం..! ముఖ్యంగా పేద జనం జగన్‌ వెంటే ఉన్నారు. క్రమం తప్పకుండా డబ్బు అందుకున్నవారు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులూ – జగన్‌కి అండగా నిలబడి ఉన్నారు. సభల్లో జగన్‌ ఫ్యాన్‌ గుర్తు చూపించినప్పుడు ‘‘ఓటేస్తాం’’ అని స్పందిస్తున్నారు. ఇది స్పష్టంగా జగన్‌ గెలుపుని సూచిస్తోంది. జనంలో ఆయనకున్న ప్రతిష్టని తెలియజేస్తుంది.

మా నమ్మకం నువ్వే జగన్‌

మేం నమ్ముతాం నిన్నే జగన్‌

అని ప్రజలు గొంతెత్తి అంటున్నారు. జగన్‌ మాటల్ని శ్రద్ధగా వింటున్నారు. మరి, పచ్చ మీడియా ప్రచారం సంగతేమిటి..? జనం ఆ దుష్ప్రచారాన్ని నమ్మడం లేదని తేలిగ్గా చెప్పొచ్చు. చంద్రబాబు ఎంత గొంతు చించుకున్నా, పవన్‌ కళ్యాణ్‌ ఎంత రెచ్చిపోయినా, పురందేశ్వరి ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, షర్మిల ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా – జనం జగన్‌ వెంట స్థిరంగా నిలబడి ఉండటం దేనికి సంకేతం..?

లోకేష్‌ బాబులూ, రఘురామకృష్ణంరాజులూ జగన్ని ఆపగలరా..? ఆంధ్రప్రదేశ్‌ మీద, అదిగో, జగన్‌ జెండా ఎగురుతోంది. కసితో, ఉద్వేగంతో వైసీపీ శ్రేణుల రక్తం మరుగుతోంది. ఆ ఎన్నికల విజయలక్ష్మి జగన్‌ వెంట తిరుగుతోంది. ముచ్చెమటలు పట్టిన మూడు పార్టీల విషాద కూటమి, కడుపు రగిలిపోతుండగా, జగన్‌ విజయ యాత్రని చూసి అసూయతో రగిలిపోతోంది. చూస్తున్నారుగా, చంద్రబాబుని చరిత్ర చెత్తుబుట్టలోకి నెట్టి వేయడానికి పరుగు పరుగున వస్తున్నాయి ఎన్నికలు..!

First Published:  8 April 2024 6:21 AM GMT
Next Story