ఏపీలో చాగంటి పాలిటిక్స్.. చివరకు ఇలా కూడానా..?
ఆయన అంత వినమ్రంగా పదవి లేకున్నా కూడా తాను పనిచేస్తానని చెబితే.. దాన్ని చిలువలు పలువలు చేసి పదవి తిరస్కరించిన చాగంటి అంటూ హైలెట్ చేస్తోంది టీడీపీ అనుకూల మీడియా.
ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకి ఏపీ ప్రభుత్వం ఆమధ్య టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ఆఫర్ చేసింది. ఆ తర్వాత చాగంటి.. సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా కలవడం, జగన్ తో భేటీ అనంతరం, అక్కడే ఉన్న గోశాలను సందర్శించి ప్రశంసించడం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తనకు సలహాదారు పదవి వద్దన్నారనే ప్రచారం మొదలైంది. టీడీపీ అనుకూల మీడియా చాగంటి వార్తల్ని హైలెట్ చేస్తోంది. సలహాదారు పదవి ఆయన వద్దన్నారంటే అది జగన్ కి అవమానకరం అన్న రీతిలో వార్తలు వండివారుస్తున్నారు.
అసలు చాగంటి ఏమన్నారు..?
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాగంటి తన సలహాదారు పదవిపై మాట్లాడారు. తనకు అసలు ఆ పదవి వద్దన్నానని చెప్పుకొచ్చారు. పదవి లేకపోయినా తాను శ్రీవారి సేవకు ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. శ్రీవారి సేవ కోసం, తన అవసరం ఉంది అనుకుని పిలిస్తే, కచ్చితంగా వెళ్లి తన శక్తివంచన లేకుండా ఆ పని చేసి పెడతానని క్లారిటీ ఇచ్చారు. అంతే తప్ప పదవులు తనకు అక్కర్లేదన్నారు. ఆయన అంత వినమ్రంగా పదవి లేకున్నా కూడా తాను పనిచేస్తానని చెబితే.. దాన్ని చిలువలు పలువలు చేసి పదవి తిరస్కరించిన చాగంటి అంటూ హైలెట్ చేస్తోంది టీడీపీ అనుకూల మీడియా.
రామచంద్రమూర్తితో పోలికా.. ?
గతంలో సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి కూడా ఇలాగే సలహాదారు పదవి వద్దని అన్నారు. పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. తన సలహాలు ఎవరూ తీసుకోవడంలేదని, అందుకే తనకు ఆ పదవిలో ఉండటం ఇష్టం లేదని రిజైన్ చేశారు రామచంద్రమూర్తి. అయితే చాగంటి ఇక్కడ పదవిని తీసుకోలేదు, రాజీనామా చేయనూలేదు. కేవలం తనకు పదవులు అవసరం లేదని మాత్రమే అన్నారు. అయినా కూడా ఆయన పేరుతో ఇప్పుడు ఏపీలో రాజకీయం మొదలైంది. టీటీడీ పదవిని తిరస్కరించిన చాగంటి అనే హెడ్డింగ్ లు హైలెట్ అవుతున్నాయి. దీనిపై టీటీడీ స్పందనే మిగిలి ఉంది అంటూ ఆల్రడీ మంట పెట్టేశారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.