సలహాదారుగా చాగంటి..
చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో కీలక స్థానం దక్కింది. ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో జరిగిన హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్య నిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
గ్రామీణ యువతను భాగస్వాములను చేస్తూ గ్రామాల్లో పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామీణ వాసులకు భజన, కోటాలం సామగ్రి అందించాలని నిర్ణయించినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం 2016లో చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారుగా నియమించింది. అయితే చాగంటి మాత్రం పదవి స్వీకరించలేదు. ఇప్పుడు చాగంటికి టీటీడీలో సలహాదారుగా అవకాశం వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. కాకినాడ వేదికగా ఎక్కువగా ప్రవచనాలు చెబుతుంటారు.