Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు లేఖపై స్పందించిన సీఈవో.. అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల నియమావళిని అతిక్రమించారని.. అంతే కాకుండా ఆయనకు అధికారులు సహకరించారని సదరు లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు లేఖపై స్పందించిన సీఈవో.. అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ
X

చంద్రబాబు నాయుడు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు వైసీపీ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహార శైలిపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ రోజు విశాఖలో పర్యటించిన వైవీ సుబ్బారెడ్డి.. పలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారని.. ఇది నిబంధనలకు విరుద్దమంటూ టీడీపీ అధినేత చంద్రాబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాజాగా, దీనిపై స్పందించిన ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా.. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్, తహశీల్దార్‌తో పాటు ఎస్ఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

చంద్రబాబు నాయుడు సీఈవోకి రాసిన లేఖలో పలు విషయాలను పేర్కొన్నారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల నియమావళిని అతిక్రమించారని.. అంతే కాకుండా ఆయనకు అధికారులు సహకరించారని సదరు లేఖలో పేర్కొన్నారు. స్థానికేతరుడు అయిన సుబ్బారెడ్డి.. పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తున్నా.. అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అధికారులతో పాటు వైవీ సుబ్బారెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు.

ఇక శుక్రవారం కూడా సీఈవోకు చంద్రబాబు మరో లేఖ రాశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్స్‌లో భద్రత పెంచాలని చంద్రాబాబు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార వైసీపీ అక్రమాలకు, ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అనంతపురంలోని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అక్రమాలకు ప్రయత్నించిందని కూడా ఆయన ప్రస్తావించారు.

టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని వెంటనే విడుదల చేయాలని.. కౌంటింగ్ హాల్‌లో రభస సృష్టించిన వారిని అదుపులోకి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులు, ఎన్నికల అధికారులను ఆదేశించాలని సీఈవోకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే, ఏపీ సీఈవో మాత్రం విశాఖలో వైవీ సుబ్బారెడ్డి పర్యటన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మాత్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మిగిలిన విషయాలపై ఇంకా తమ స్పందన తెలియజేయలేదు.





First Published:  18 March 2023 5:55 PM IST
Next Story