Telugu Global
Andhra Pradesh

పవన్ గాలి తీసేసిన కేంద్రం

హోంశాఖ రిలీజ్ చేసిన లెక్కలకు పవన్ చేస్తున్న ఆరోపణలకు అసలు పొంతనే లేదని తెలిసిపోతోంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్, అపహరణలకు గురవుతున్న మహిళలు లక్ష మందికి సగటు 7.4 మంది ఉంటే ఏపీలో ఈ రేషియో 1.6 గా నమోదైంది.

పవన్ గాలి తీసేసిన కేంద్రం
X

హ్యూమన్ ట్రాఫికింగ్ అని పదే పదే వలంటీర్లపై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర హోంశాఖలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(సీఎన్ఆర్బీ) ఒక్కసారిగా గాలి తీసేసింది. వారాహి యాత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ బురద చల్లేస్తున్నట్లు తేల్చిచెప్పేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా కిడ్నాపు, అపహరణలకు గురవుతున్న మహిళల్లో ఏపీది 18వ స్థానమని చెప్పింది. మొదటి మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలున్నాయి. గడచిన రెండేళ్ళల్లో ఏపీలో కిడ్నాప్, అపహరణలకు గురైన మహిళల సంఖ్య 867 మంది మాత్రమే.

అయితే పవన్ మాత్రం 32 వేల మంది మిస్సింగని, 14 వేల మంది మహిళల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదంటూ నానా గోల చేస్తున్నారు. పైగా హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే పవన్ మరింతగా రెచ్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వివిధ రాష్ట్రాల్లో మహిళల కిడ్నాపులు, అపహరణలు ఏ విధంగా ఉన్నాయో లెక్కలతో సహా హోంశాఖ వివరించింది.

హోంశాఖ రిలీజ్ చేసిన లెక్కలకు పవన్ చేస్తున్న ఆరోపణలకు అసలు పొంతనే లేదని తెలిసిపోతోంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్, అపహరణలకు గురవుతున్న మహిళలు లక్ష మందికి సగటు 7.4 మంది ఉంటే ఏపీలో ఈ రేషియో 1.6 గా నమోదైంది. రెండేళ్ళల్లో ఉత్తరప్రదేశ్‌లో 14,714 మంది మహిళలు కిడ్నాప్, అపహరణలకు గురయ్యారు. మహారాష్ట్రలో 10,680, బీహార్లో 10,252 కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.

కేంద్రం తాజా లెక్కలతో పవన్ ఎంతటి తప్పుడు లెక్కలు చెబుతున్నారో జనాలందరికీ అర్థ‌మవుతోంది. జగన్ ప్రభుత్వంపై బురదచల్లటానికి మాత్రమే వారాహియాత్ర పేరుతో పవన్ తిరుగుతున్నట్లు అర్థ‌మవుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల పేరుతో తాను చెబుతున్నది అబద్ధ‌మ‌ని పవన్‌కు బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ కేంద్ర నిఘా వర్గాలే లేవుకాబట్టి. అందుకనే మంత్రులు మాట్లాడుతూ.. నిఘా వర్గాల పేరుతో పవన్ చెబుతున్నదంతా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అని పదేపదే ఎదురుదాడులు చేస్తున్నారు. మరి కేంద్రం రిలీజ్ చేసిన తాజా లెక్కలతో అయినా పవన్ వైఖరి మారుతుందా?

First Published:  15 July 2023 10:09 AM IST
Next Story