ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపు.. కేంద్రం కీలక ప్రకటన
హైకోర్టును కర్నూలుకు తరలించే విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
మరికొద్ది రోజుల్లో విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇటీవల పలుమార్లు చెప్పారు. తన నివాసాన్ని కూడా విశాఖకు మారుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టును కూడా అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్నూలుకు తరలింపు వ్యవహారం రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్నట్లు చెప్పారు.
హైకోర్టును కర్నూలుకు తరలించే విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. హైకోర్టు నిర్వహణ వ్యయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.హైకోర్టు రోజువారీ పాలనా వ్యవహారాల బాధ్యత సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిదేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు అయ్యిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు తరలింపుపై ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పార్లమెంటులో పేర్కొన్నారు.