ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన..
కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు కానీ, ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదనే చెప్పాలి. ఈ దశలో ఇప్పుడు కేంద్రం కూడా తమ వద్ద పెండింగ్ ప్రతిపాదనలేవీ లేవని చెప్పడంతో హైకోర్టు తరలింపు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.
ఏపీ హైకోర్టును ప్రస్తుతం ఉన్న అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన తమ వద్ద పెండింగ్ లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసినట్టు తెలిపింది కేంద్రం. ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్ ని విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశామని చెప్పింది. 2020 ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్ ని కర్నూలుకు మార్చాలని సీఎం జగన్ ప్రతిపాదించినట్టు తెలిపింది.
హైకోర్టు ఇప్పట్లో కదలదు..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు సంబంధించి చట్టం తెచ్చారు. ఈ చట్టం శాసన సభలో ఆమోదం పొందినా, మండలిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి రైతుల కేసులతో వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. కోర్టులో వాదోపవాదాలు జరుగుతుండగానే.. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. తిరిగి మరోసారి దాన్ని పక్కా ప్రణాళికతో తెరపైకి తెచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. గతంలో నేతలు జోరుగా ఉన్నారు కానీ, ప్రస్తుతం మూడు రాజధానులపై పెద్దగా దృష్టిపెట్టినట్టు లేదు. ఈలోగా కోర్టు తీర్పులతో అమరావతిలో కూడా అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు సంగతి పక్కనపెడితే.. ముందు అర్జంట్ గా హైకోర్టును అమరావతి నుంచి తరలించి కర్నూలుకు చేర్చాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు కానీ, ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదనే చెప్పాలి. ఈ దశలో ఇప్పుడు కేంద్రం కూడా తమ వద్ద పెండింగ్ ప్రతిపాదనలేవీ లేవని చెప్పడంతో హైకోర్టు తరలింపు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడంలేదు.
2024 ఎన్నికల అజెండా అదేనా..?
మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉన్నట్టే కనిపిస్తున్నా.. 2024లో అదే అజెండాతో ఎన్నికలకు వెళ్తుందా లేదా అనేది అనుమానమే. అమరావతి ఏకైక రాజధాని డిమాండ్ కేవలం ఆ రెండు జిల్లాలవారికే పరిమితం అనుకుంటే మాత్రం వైసీపీ ధైర్యంగా ముందడుగు వేస్తుంది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ఓటర్లు వైసీపీకే పట్టం కట్టారు. దీంతో జగన్ ధీమాగానే ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల అజెండాతో ఓట్లు అడుగుతుందా, లేక రాజధాని అంశాన్ని పక్కనపెట్టి సంక్షేమ కార్యక్రమాల అజెండాతోనే ముందుకెళ్తుందా అనేది వేచి చూడాలి. కేంద్రం ఇచ్చిన వివరణతో.. 2024 కి ముందు హైకోర్టు అమరావతి నుంచి కర్నూలుకి తరలిరాదనే విషయంలో పూర్తి స్పష్టత వచ్చినట్టయింది.