లెక్క తేలిపోతుందా..?
ఇద్దరి పరస్పర ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ తొందరలోనే క్షేత్రస్థాయి పర్యటనకు రాబోతున్నది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు సమాచారం అందించింది.
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందనే సామెత తెలుగులో బాగా పాపులర్. ఈ సామెతలో చెప్పినట్లుగా రెండుపార్టీల మధ్య నలుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో దొంగఓట్ల ఆరోపణలు పెద్ద వివాదంగా మారిపోయింది. దొంగఓట్లకు కారణం మీరేనంటే కాదు మీరే అంటు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆరోపణలతో సరిపెట్టుకోకుండా ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్ళి రాతపూర్వకంగా కూడా ఫిర్యాదులు చేసుకున్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ కమిషనర్ ను చంద్రబాబు నాయుడు కలిసి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దానికి కౌంటరుగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాయకత్వంలో మరికొందరు ఎంపీలు కూడా చీఫ్ కమిషనర్‌ను కలిసి టీడీపీపై ఫిర్యాదులు చేశారు. చంద్రబాబు ఫిర్యాదు ఏమిటంటే.. టీడీపీకి పడతాయని అనుకుంటున్న ఓట్లను, అధికార పార్టీకి పడవని అనుమానం ఉన్న ఓట్లను తొలగిస్తున్నారట. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ సుమారు 10 వేల ఓట్లను తొలగించిందట. ఇక విజయసాయి ఫిర్యాదు ఏమిటంటే.. టీడీపీ హయాంలో చేర్చిన దొంగఓట్లనే ఇప్పుడు ప్రభుత్వం తొలగిస్తుందట.
ఇద్దరి పరస్పర ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ తొందరలోనే క్షేత్రస్థాయి పర్యటనకు రాబోతున్నది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు సమాచారం అందించింది. ఇద్దరి ఫిర్యాదులపైనా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
జిల్లాల పర్యటనల్లో కలెక్టర్లతో భేటీ అవబోతోంది. తొలగించిన ఓట్లతో పాటు చేర్చిన ఓట్లను కూడా పరిశీలించబోతోంది. ర్యాండంగా కొన్ని ఇళ్ళని పరిశీలించే అవకాశముందని సమాచారం. 2019 ఎన్నికల సమయానికి ఉన్న ఓట్లెన్ని అప్పట్లోనే ఆరోపణలు వచ్చిన దొంగఓట్ల వివరాలతో ఇప్పుడు వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారట. ఎన్నికల కమిషన్ తరఫున పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది, అధికారులతో కూడా కమిషన్ ఉన్నతాధికారులు సమావేశమవబోతున్నారు. దొంగఓట్ల పరిశీలనలో కమిషన్ ఉన్నతాధికారులు ఎన్నిరోజులు పర్యటించబోతున్నారన్నది తెలీదు. మరి పరిశీలనలో ఏమి తేలుతుందో చూడాలి.
*