గ్లాస్ గుర్తు మళ్లీ జనసేనకే కేటాయించిన ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన జనసేన పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును మళ్లీ జనసేన పార్టీకే కేటాయించింది. మళ్లీ అదే సింబల్ వస్తుందో రాదో అని డైలమాలో ఉన్న జనసేనకు కాస్త ఊరట లభించింది. గ్లాస్ గుర్తును ఈసీ జనసేనకే కేటాయించడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. గత ఎన్నికల సమయంలో ఏపీలో 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో, పలు లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేసింది. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొన్ని స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేసింది.
గత ఎన్నికల సమయంలో జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. దీంతో ఆ పార్టీ గ్లాస్ గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నామమాత్రంగానే పోటీ చేసింది. ఏపీలో పలు ఉప ఎన్నికలు జరిగిన సమయంలోనూ ఆ ఎన్నికలకు జనసేన దూరంగా ఉండిపోయింది.
దీంతో కొన్ని నెలల కిందట కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించిన గ్లాస్ గుర్తును రద్దు చేసింది. బద్వేలు ఎమ్మెల్యే మృతితో అక్కడ ఉప ఎన్నిక రాగా.. ఓ ఇండిపెండెంట్ క్యాండెట్ కి అందుబాటులో ఉన్న గుర్తుల నుంచి గ్లాస్ గుర్తును కూడా కేటాయించారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు వస్తుందో రాదో అన్న అనుమానాలు ఆ పార్టీ క్యాడర్‌లో ఉన్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించకపోతే ఆ పార్టీకి నష్టం కలుగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన జనసేన పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు.
*