సమాచార హక్కు పటిష్టానికి వర్చువల్ విచారణ తప్పనిసరి
సమాచార హక్కు పటిష్టంగా అమలుకావాలంటే.. ఫిర్యాదుదారులకు కమిషన్ పై నమ్మకం కలగాలన్నారు హీరాలార్ సమారియా. కమిషన్ ముందుకు వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సూచించారు.
సమాచార హక్కు పటిష్టంగా అమలు కావాలంటే వర్చువల్ విచారణ కూడా తప్పనిసరి అని చెప్పారు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియా. మంగళగిరిలోని ఏపీ సమాచార కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ మహబూబ్ బాష, ఇతర కమిషనర్లు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో సమాచార హక్కు పటిష్టంగా అమలు చేసేందుకు పలు సూచనలు చేశారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ బాధ్యత సమాచార కమిషనర్లు, ప్రధాన కమిషనర్ ల పైనే ఎక్కువగా ఉంటుందని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రధాన ఉద్దేశాలు పారదర్శకత, జవాబుదారీతనం అని వివరించారు సమారియా.
ఇ- ఫైలింగ్ తప్పనిసరి..
సమాచార హక్కు పటిష్టంగా అమలుకావాలంటే.. ఫిర్యాదుదారులకు కమిషన్ పై నమ్మకం కలగాలన్నారు హీరాలార్ సమారియా. సమాచార కమిషన్ ఆర్టీఐకి న్యాయం చేయగలిగినప్పుడే ఆ నమ్మకం మొదలవుతుందని చెప్పారు. కమిషన్ ముందుకు వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. మంగళగిరిలోని కార్యాలయానికి రావాలంటే అటు అనంతపురం, ఇటు శ్రీకాకుళం ప్రాంతాలవారికి ఇబ్బందిగా ఉంటుందని, అందుకే వర్చువల్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. దీని వల్ల ఫిర్యాదుదారులకు వ్యయప్రయాసలు తప్పుతాయని, సత్వర పరిష్కారం కూడా సాధ్యమవుతుందని వివరించారు. ఫిర్యాదులు, విచారణలకు సంబంధించి ఇ- ఫైలింగ్ కూడా తప్పనిసరి అని చెప్పారు హీరాలాల్ సమారియా. ఈ రెండు విధానాలు అమలు చేయడానికి తాను పూర్తి స్థాయిలో ఏపీ సమాచార కమిషన్ కు సహకరిస్తానన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడతానన్నారు. ఆర్టీఐ చట్టం మనుగడ ప్రజాస్వామ్యంలో చాలా అవసరం అని చెప్పిన ఆయన, ఆటవిడుపు ధోరణి ఉండకూడదన్నారు. ఏపీలో కమిషన్ కు సొంత కార్యాలయం ఉండాలని అన్నారు హీరాలాల్ సమారియా.
ఏపీలో వర్చువల్ విచారణ..
ఏపీలో ఇప్పటికే వర్చువల్ పద్ధతిలో విచారణ జరుగుతోందని కేంద్ర ప్రధాన కమిషనర్ కు వివరించారు రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ మహబూబ్ బాష. ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన వర్చువల్/హైబ్రిడ్ విధానంలో విచారణలు మొదలు పెట్టామని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరామని అన్నారు. కమిషన్ కు వస్తున్న అప్పీళ్లు, ఫిర్యాదుల గురించి ఆయన ఈ సమావేశంలో వివరించారు.