Telugu Global
Andhra Pradesh

పులివెందులలో సీబీఐ.. మళ్లీ టెన్షన్ మొదలు

వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో ఇనయతుల్లా కీలకమైన వ్యక్తిగా సీబీఐ భావిస్తోంది. ఆయన డెడ్ బాడీని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపించింది ఇనయతుల్లానే.

పులివెందులలో సీబీఐ.. మళ్లీ టెన్షన్ మొదలు
X

వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో ఇది మరో కీలక పరిణామం. సీబీఐ బృందం మరోసారి పులివెందులలో తనిఖీలు చేపట్టింది. ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు వివేకా ఇంటిని, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. కడప నుంచి ముందుగా పులివెందులలోని వైఎస్ వివేకా ఇంటికి వెళ్లిన అధికారులు హత్య జరిగిన స్థలాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు, తిరిగి మళ్లీ వివేకా ఇంటికి వచ్చి ఆయన దగ్గర గతంలో టైపిస్ట్ గా, ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఇనయతుల్లా నుంచి సమాచారం సేకరించారు.

వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో ఇనయతుల్లా కీలకమైన వ్యక్తిగా సీబీఐ భావిస్తోంది. ఆయన డెడ్ బాడీని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపించింది ఇనయతుల్లానే. అందుకే ఆయన నుంచి మరోసారి కీలక వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీబీఐ అధికారులు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై మరోసారి ఆరా తీసినట్టు తెలుస్తోంది.

రేపు సుప్రీంలో విచారణ..

రేపు సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిషన్ పై విచారణ జరుగుతుంది. అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్ట్ లో సునీత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సమయంలో అందుబాటులో ఉండేందుకు సీబీఐ బృందం ఢిల్లీ బయలుదేరింది. మధ్యలో పులివెందులలో వారు ఆగడం, తనిఖీలు చేయడంతో కలకలం రేగింది.

రేపు కీలక పరిణామం..

అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందంటూ చాలాసార్లు వార్తలు వచ్చినా నాలుగుసార్లు కేవలం విచారణ జరిపి పంపించేశారు అధికారులు. ఐదోసారి అరెస్ట్ తప్పదు అనేసరికి ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈనెల 25వరకు అరెస్ట్ వద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సోమవారం దీనిపై సుప్రీంకోర్ట్ విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీం ఉత్తర్వులతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

First Published:  23 April 2023 5:42 PM IST
Next Story