అవినాష్ కి మళ్లీ నోటీసులు.. మే-19న హాజరు కావాల్సిందే
లిఖితపూర్వక నోటీసులు కూడా అవినాష్ రెడ్డికి అందేలా సీబీఐ ప్రయత్నించింది. పులివెందులలో ఉన్న సీబీఐ బృందం వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్ నాగరాజుకు నోటీసులు అందజేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమధ్య అవినాష్ రెడ్డిని సీబీఐ ఎంక్వయిరీకి పిలవగా.. ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు మధ్య ఈ కేసు ఊగిసలాడింది. ఆ తర్వాత వేసవి సెలవలతో వ్యవహారం వాయిదా పడింది. ముందస్తు బెయిల్ కి కోర్టులు అనుమతివ్వకపోవడంతో, ఈసారి సీబీఐ విచారణకు పిలిస్తే కచ్చితంగా అరెస్ట్ చేస్తారనే సంకేతాలున్నాయి. దీంతో తాజా నోటీసులకు ఆయన రాలేనని సమాధానమిచ్చారు. మంగళవారం సీబీఐ ముందు హాజరు కావాలని నోటీసులు రావడం, ఆయన కుదరదని చెప్పడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఈనెల 19కి విచారణ వాయిదా వేసింది సీబీఐ.
కారులో ఉండగా వాట్సప్ మెసేజ్..
నాలుగు రోజుల గడువు కావాలని అవినాష్ రెడ్డి సీబీఐని కోరగా.. అధికారులు సరేనన్నారు. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల కారులో బయలుదేరారు. ఆయన కారులో ఉండగానే వాట్సప్ ద్వారా మరోసారి నోటీసుల్ని పంపించింది సీబీఐ. మే-19న విచారణకు రావాలని కోరింది. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హజరుకావాలని సూచించింది.
మే-19న ఏం జరుగుతుంది..?
అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ ని అడ్డుకోడానికి ఆయన న్యాయస్థానాల ద్వారా చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు లిఖితపూర్వక నోటీసులు కూడా అవినాష్ రెడ్డికి అందేలా సీబీఐ ప్రయత్నించింది. పులివెందులలో ఉన్న సీబీఐ బృందం వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్ నాగరాజుకు నోటీసులు అందజేసింది. వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఈ నెల 19న విచారణకు రావాలని కోరింది.