ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ తాజా నోటీసులు
మరోసారి నోటీసులు ఇస్తే హాజరైనందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోని ఈనెల 28న విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ తాజా నోటీసుల్లో ఆదేశించింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం 24న విచారణకు హాజరు కావాల్సిందిగా తొలుత నోటీసుల్లో సీబీఐ ఆదేశించింది. నేడు నోటీసులు ఇచ్చి రేపు రావాలంటే ఎలా అని అవినాష్ రెడ్డి ఆ సందర్భంలో ప్రశ్నించారు. తనకు ఐదు రోజులపాటు బిజీ షెడ్యూల్ ఉందని, ఐదు రోజుల గడువు కావాలని, మరోసారి నోటీసులు ఇస్తే హాజరైనందుకు సిద్ధమని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోని ఈనెల 28న విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ తాజా నోటీసుల్లో ఆదేశించింది.
ఈనెల 28న హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. వైఎస్ వివేకా హత్య వెనుక పెద్దలు ఉన్నారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.. ధైర్యంగా ముందుకెళ్లాలని గంగిరెడ్డి చెప్పారంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఎంపీ టికెట్ విషయంతో వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు మధ్య వివాదం ఉన్న మాట వాస్తవమేనని.. సీబీఐ అనుమానిస్తున్న వారి ప్రమేయం హత్య వెనుక ఉండవచ్చని షర్మిల కూడా సీబీఐ వద్ద వాంగ్మూలం ఇచ్చింది. దాంతో అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ దృష్టి సారించింది.
ముఖ్యంగా హత్య జరిగిన తర్వాత అందరికంటే ముందుగా వివేకానంద రెడ్డి ఇంటి వద్దకు అవినాష్ రెడ్డి వెళ్లడం, అక్కడ నెత్తుటి మరకలను శుభ్రం చేయించడం, వివేకానంద రెడ్డి తలపై ఉన్న గొడ్డలిపోట్లకు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి నుంచి సిబ్బందిని పిలిపించి కుట్లు వేయించడం వంటి చర్యలు వెనుక అవినాష్ రెడ్డి హస్తముందని సీబీఐ గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డిని విచారణకు సీబీఐ పిలుస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.