కొత్త పార్టీ పెడతా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆయన పలుమార్లు ప్రకటించినప్పటికీ ఏ పార్టీ నుంచి పోటీ చేసే విషయం మాత్రం చెప్పలేదు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తాను విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేస్తానని.. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గత ఎన్నికలకు ముందు లక్ష్మీనారాయణ ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ముందుగా కొత్త పార్టీ పెట్టాలని భావించి రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేసినప్పటికీ చివర్లో ఆయన జనసేన పార్టీలో చేరారు.
ఆ పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్‌ను విభేదించి జనసేన పార్టీని వీడారు. లక్ష్మీనారాయణ వేరే పార్టీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ విశాఖ నుంచి పోటీ చేస్తానని ఆయన పలుమార్లు ప్రకటించినప్పటికీ ఏ పార్టీ నుంచి పోటీ చేసే విషయం మాత్రం చెప్పలేదు.
అయితే ఈ విషయమై తాజాగా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. విశాఖ నుంచే తాను పోటీ చేయడం ఖాయమని, ఇందుకోసం అవసరమైతే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ ఓట్ల ఏరివేత కచ్చితంగా జరగాలని చెప్పారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.