Telugu Global
Andhra Pradesh

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ.. పేరేంటంటే..!

జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసుల విచారణతో ఒక్కసారిగా లక్ష్మీనారాయణకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ.. పేరేంటంటే..!
X

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై కసరత్తులు చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల ముంగిట కొత్త పార్టీలు కూడా పురుడు పోసుకుంటున్నాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇవాళ రాత్రి తాను స్థాపించబోయే కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

'జై భారత్ పార్టీ' పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో ఇవాళ రాత్రి కొత్త పార్టీ పేరును లక్ష్మీనారాయణ ప్రకటించనున్నారు. గత ఏడాదే పార్టీని లక్ష్మీనారాయణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం.

జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసుల విచారణతో ఒక్కసారిగా లక్ష్మీనారాయణకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత జనసేన పార్టీలో చేరిన ఆయన గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు కొంత‌ దూరంగా ఉన్నారు.

కొద్ది రోజుల కిందటి నుంచి మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. లేకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు కొద్ది రోజుల కిందట లక్ష్మీనారాయణ ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన ఇవాళ 'జై భారత్ పార్టీ'ని స్థాపించనున్నట్లు తెలుస్తోంది.

First Published:  22 Dec 2023 7:15 PM IST
Next Story