ఎల్లో మీడియాను సీబీఐ నిరాశపరిచిందా?
వివేకా హత్య విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని ఎల్లో మీడియా ఊహించినట్లుంది. అదేమీ జరగకపోవటంతో చాలా నిరుత్సాహపడుంటుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఎల్లో మీడియాను సీబీఐ బాగా నిరాశపరిచినట్లే ఉంది. వివేకా హత్య విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు గంటలపాటు విచారించింది. అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుందని సీబీఐ చెప్పటం అందుకు ఎంపీ వస్తానని చెప్పటంతో విచారణ ముగిసింది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ వన్ టు వన్ ఏమి జరిగింది ఎంపీ చెప్పకపోయినా..మొత్తంమీద తనను సీబీఐ సాక్షిగా మాత్రమే పిలిచిందని చెప్పారు.
ఇక్కడే ఎల్లో మీడియా బాగా నిరాశపడినట్లుంది. ఎందుకంటే వివేకా హత్య జరిగినప్పటినుంచి అవినాష్ రెడ్డిదే ప్రధాన పాత్రంటూ ఎల్లో మీడియా నానా గోల చేస్తోంది. వివేకా హత్యలో తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, కొడుకు అవినాష్ రెడ్డే కీలకపాత్రదారులంటు నానా రచ్చ చేస్తోంది. దానికితోడు వివేకా కూతురు సునీతారెడ్డి కూడా ఒక్కోసారి ఒక్కో విధంగా ఆరోపణలు చేయటంతో దాన్ని ప్రతిపక్షాలతో పాటు ఎల్లో మీడియా కూడా బాగా అడ్వాంటేజ్ తీసుకుంది.
సీబీఐ విచారణకు హాజరవ్వకుండా అవినాష్ ప్రయత్నిస్తున్నారని దీనికి జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలుకుతున్నారని చాలా కథనాలే అచ్చేసింది. నరేంద్రమోడిని జగన్ భేటీ అయినపుడల్లా అవినాష్ విషయం కూడా మాట్లాడారంటూ ఒకటే ఊదరగొట్టేసింది. అవినాష్‌ను సీబీఐ ఎక్కడ అరెస్టు చేస్తుందో అనే భయంతో జగన్ అసలు విచారణకు కూడా అవినాష్ హాజరుకాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారంటూ చాలాకాలంగా కథనాలిస్తోంది. సీబీఐ విచారణకు హాజరై అవినాష్ అరెస్టయితే తాను కూడా ఇరుక్కుంటాననే టెన్షన్ జగన్‌లో పెరిగిపోతోందంటూ విచిత్రమైన వార్తలను వండివార్చింది.
అయితే ఆ కథనాలు, వార్తలకు భిన్నంగా సీబీఐ ఎంపీని కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు రమ్మని నోటీసులివ్వటంతో ఎల్లో మీడియా బాగా నిరశపడినట్లే ఉంది. ఎల్లో మీడియా ఆశించినట్లే జరుగుంటే భూమి దద్దరిల్లిపోయేట్లుగా వార్తలు, కథనాలు, టీవీల్లో డిబేట్లు మొదలైపోయుండేదే అనటంలో సందేహం లేదు. హత్యలో కీలకపాత్ర ఉందనే అనుమానంతో విచారించటానికి, సాక్షిగా విచారించటానికి చాలా తేడా ఉంది. వివేకా హత్యలో తనకు తెలిసిన వివరాలను సీబీఐ అడిగిందని తనకు తెలిసినంత వరకు చెప్పానని ఎంపీ మీడియాతో చెప్పారు. గంటలపాటు విచారణ జరిపిన తర్వాత సీబీఐ ఎంపీని అరెస్టు చేస్తుందని ఎల్లో మీడియా ఊహించినట్లుంది. అదేమీ జరగకపోవటంతో చాలా నిరుత్సాహపడుంటుంది.