వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట..
తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలంటూ సీబీఐ కోర్టుని భాస్కర్ రెడ్డి అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఆయన్ను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలని సిఫార్సు చేసింది.
వైఎస్ వివేకా హత్యకేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనను ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు, హైదరాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ కు సిఫార్సు చేసింది. వివేకా హత్య కేసులో మే 16న సీబీఐ, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగా ఆయన చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలంటూ సీబీఐ కోర్టుని ఆయన అభ్యర్థించారు. ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఆయన్ను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలని సిఫార్సు చేసింది.
గతంలో తిరస్కరణ..
గతంలో ఇదే అభ్యర్థనను సీబీఐ కోర్టు ఓసారి తిరస్కరించింది. గతనెల 16న అరెస్ట్ చేసిన వెంటనే.. తనకు చంచల్ గూడ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కావాలని భాస్కర్ రెడ్డి కోరారు. జీవన శైలి, సామాజిక హోదాతోపాటు.. రాజకీయాల్లో ఉంటూ పేదలకు తాను చేస్తున్న సేవని పరిగణలోకి తీసుకోవాలని ఆ పిటిషన్లో కోరారు భాస్కర్ రెడ్డి. కానీ సీబీఐ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. రెండోసారి మళ్లీ అదే అభ్యర్థన చేయగా ఈసారి అంగీకరించింది. ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించేందుకు సమ్మతించింది.
బెయిల్ పిటిషన్..
మరోవైపు బెయిల్ కోసం కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టుని ఆశ్రయించారు. తనకి ఆరోగ్యం బాగా లేదని.. హత్య కేసులో తన పాత్రపై ఎలాంటి ఆధారాలూ లేకపోయినా అరెస్ట్ చేశారని సీబీఐ కోర్టుకి పిటీషన్ ద్వారా విన్నవించుకున్నారు భాస్కర్ రెడ్డి. బెయిల్ మంజూరు చేయాలని కోరారు.