Telugu Global
Andhra Pradesh

అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ

హత్యాస్థలిలో నెత్తుటి మరకలను శుభ్రం చేయడం, మృతదేహానికి కుట్లు వేయడం వంటి పనుల వెనుక అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ అనుమానిస్తోంది.

అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ
X

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ఒకసారి ఆయన్ను విచారించిన సీబీఐ ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 24 మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా తాజా నోటీసుల్లో ఆదేశించింది. గత నెల 28న హైదరాబాద్‌లోని కార్యాలయంలో అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించింది. అవినాష్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగా జగన్‌ ఇంట్లో పనిచేసే నవీన్‌, సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డిలనూ సీబీఐ విచారించింది.

హత్యాస్థలిలో నెత్తుటి మరకలను శుభ్రం చేయడం, మృతదేహానికి కుట్లు వేయడం వంటి పనుల వెనుక అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ అనుమానిస్తోంది. కడప ఎంపీ టికెట్ వివాదమే వివేకా హత్యకు కారణమని భావిస్తోంది. ఇందుకు షర్మిల వాంగ్మూలం కూడా బలానిచ్చింది. రెండోసారి విచారణకు పిలవడం, ఆధారాలు చెరిపివేసిన ఘటనలో ప్రత్యక్ష ప్రమేయం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈసారి కూడా అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించి పంపిస్తుందా లేక అరెస్ట్‌ వరకు వెళ్తుందా అన్న దానిపైనా చర్చ నడుస్తోంది.

తాజాగా తనకు నోటీసులు అందిన మాట వాస్తవమేనని అవినాష్ రెడ్డి ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేశారు.

First Published:  18 Feb 2023 7:33 PM IST
Next Story