Telugu Global
Andhra Pradesh

అనంతపురంలో కన్న కూతురును హత్య చేసిన తండ్రి

మరో కులం అబ్బాయిని ప్రేమించిందనే కోపంతో ఓ తండ్రి కన్న కూతురును హత్య చేసిన సంఘటన అనంతపురంలో జరిగింది. అనంతరం ఆ తండ్రి పోలీసులకు లొంగిపోయాడు.

అనంతపురంలో కన్న కూతురును హత్య చేసిన తండ్రి
X

దేశంలో తరతరాలుగా సాగుతున్న మతోన్మాద, కులోన్మాద హత్యలు ఈ ఆధునిక కాలంలో కూడా ఆగడం లేదు. కుల, మతాలకు అతీతంగా మన రాజ్యాంగం రాసుకున్నప్పటికీ అనేక మంది దాన్ని పట్టించుకున్న పాపాన పోవడంలేదు. అనంతపురంలో అలా కులోన్మాదంతో రెచ్చిపోయిన ఓ తండ్రి కన్న బిడ్డను హత్య చేశాడు.

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చర్లోపల్లికి చెందిన 18 ఏళ్ల అమ్మాయి ఇంటర్ ఫెయిలై ఇంట్లోనే ఉంటుంది. ఆ క్రమంలో గ్రామంలో మరో కులానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ విషయంలో అనేక సార్లు ఆ అమ్మాయికి, ఆమె తండ్రి గురప్పకు గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. వేరే కులం అబ్బాయిని ప్రేమించడానికి గానీ, పెళ్ళి చేసుకోవడానికి కానీ వీలు లేదని గురప్ప ఆమెకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ లోపు ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తండ్రి అనుమానించాడు. దీంతో నిన్న ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఆవేశంతో గురప్ప రోకలిబండతో కూతురు తలపై మోది హత్య చేశాడు. ఆ తర్వాత ఆయన పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

First Published:  10 Sept 2022 2:48 PM IST
Next Story