Telugu Global
Andhra Pradesh

కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ.. ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు

ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారాయణ స్వామి సీరియస్ గానే ఆ వ్యాఖ్యలు చేశారా..? ఆయన వద్ద ఆధారాలేవైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ.. ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు
X

ఇన్నాళ్లూ ఏపీ రాజకీయం టీడీపీ ప్లస్ జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఏపీలో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారి వాయిస్ పెరిగింది, షర్మిల ఎంట్రీతో ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. అదే సమయంలో వైసీపీకి కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వైఎస్ఆర్ మరణం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన మరణానికి, అప్పటి ప్రమాదానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కొన్నిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. అయితే ఈరోజు కేసు రిజిస్టర్ అయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

వైసీపీ వ్యూహం ఏంటి..?

ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం అందరికీ తెలిసిందే. కేవలం ఆ పాపాన్ని మాత్రమే వైసీపీ నేతలు ప్రస్తావించి ఉంటే బాగుండేదేమో. వైఎస్ఆర్ మరణంపై అనుమానాలున్నాయంటూ పాతపాట పాడటం మాత్రం ఇప్పుడు వింతగా తోస్తోంది. రిలయన్స్ షాపులపై అప్పుడు దాడి చేసి, ఆ తర్వాత అదే రిలయన్స్ నమ్మినబంటుకి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని జనం మరచిపోలేదు. రాజకీయాల్లో వ్యాపారాలు కామన్ అని అనుకున్నా.. ఇప్పుడు మళ్లీ వైఎస్ఆర్ మరణంపై అనుమానాలు అంటూ వైసీపీ నేతలు పాత పల్లవి అందుకోవడం మాత్రం వింతగా తోస్తోంది. అక్కడితో ఆగకుండా సోనియా గాంధీ, వైఎస్ఆర్ ని చంపించేశారంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నాయకుడు ఆరోపణలు చేయడంతో వ్యవహారం రచ్చకెక్కింది. ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ అడుగు ముందుకేశారు. ఏపీ డిప్యూటీ సీఎంపై అక్కడ ఫిర్యాదు చేశారు. అక్కడ అధికారం కాంగ్రెస్ దే కాబట్టి పోలీస్ కేసు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడేం జరుగుతుంది..? అనేది ఆసక్తికరం.

ఏపీ డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నారాయణ స్వామి సీరియస్ గానే ఆ వ్యాఖ్యలు చేశారా..? వాటికి ఆయన కట్టుబడి ఉన్నారా..? కేవలం జనసామాన్యంలో ఉన్న మాటల్నే ప్రస్తావించారా, లేక ఆయన వద్ద ఆధారాలేవైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నారాయణ స్వామి వ్యాఖ్యల్ని వైసీపీలో ఎంతమంది గట్టిగా సమర్థిస్తారో వేచి చూడాలి.

First Published:  13 Jan 2024 8:25 PM IST
Next Story